ఇంకో ఐదేళ్లలో యూపీఐ ట్రాన్సాక్షన్లు 3 రెట్లు అప్‌‌

ఇంకో ఐదేళ్లలో యూపీఐ ట్రాన్సాక్షన్లు 3 రెట్లు అప్‌‌
  • ది డిజిటల్ ఫిఫ్త్‌‌ రిపోర్ట్ అంచనా 

న్యూఢిల్లీ : ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న డిజిటల్ పేమెంట్లలో 84 శాతం యూపీఐ ద్వారానే అవుతున్నాయని  ఫిన్‌‌టెక్‌‌ కన్సల్టింగ్ కంపెనీ ది డిజిటల్ ఫిఫ్త్‌‌ ఓ రిపోర్ట్‌‌లో పేర్కొంది. నెలకు సగటున 1,600 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయని, ఈ నెంబర్ 2030 నాటికి మూడు రెట్లు పెరుగుతుందని వెల్లడించింది. 

మొత్తం ఇండియా ఫైనాన్షియల్ సిస్టమ్‌‌ రూపురేఖలను మారుస్తోందని తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం, 2021–2024 మధ్య యూపీఐ ట్రాన్సాక్షన్ల సంఖ్య 4 రెట్లు పెరిగి ఏడాదికి 17,200 కోట్లకు చేరుకుంది. డిజిటల్ పేమెంట్స్ సెగ్మెంట్‌‌లో కార్డులు, వాలెట్లను ఎప్పుడో దాటేసి,  టాప్‌‌లో కొనసాగుతోంది. మూడు కోట్ల వ్యాపారాలు యూపీఐని వాడుతున్నాయి. 

మర్చంట్‌‌ టూ కన్జూమర్ (పీ2ఎం) సెగ్మెంట్‌‌ ఏడాదికి సగటున 67 శాతం వృద్ధి చెందుతోంది. పర్సన్ టు పర్సన్ (పీ2పీ) ట్రాన్సాక్షన్ సెగ్మెంట్‌‌ కంటే ఎక్కువగా వృద్ధి నమోదు చేస్తోంది. ఆర్‌‌‌‌బీఐ డేటా ప్రకారం, కిందటేడాది సెప్టెంబర్ నాటికి డిజిటల్ పేమెంట్స్‌‌  ఏడాది ప్రాతిపదికన  11.1 శాతం  పెరిగాయి.  డిజిటల్ పేమెంట్స్‌‌లో యూపీఐ వాటా 2019 లో 34 శాతం ఉంటే, 2024 నాటికి 83 శాతానికి చేరుకుంది. ఏడాదికి 74% చొప్పున గ్రోత్ నమోదు చేసింది.