హైదరాబాద్, వెలుగు: ఉప్పల్– నారపల్లి ఫ్లై ఓవర్ పనులను వచ్చే నెలలో ప్రారంభించకపోతే టెండర్ రద్దు చేస్తామని గాయత్రి కన్‌స్ట్రక్షన్‌ను ప్రభుత్వం హెచ్చరించడంతో కంపెనీ దిగొచ్చింది. తాజాగా ఫ్లై ఓవర్ పనులను ప్రారంభించినట్లు ఆర్ అండ్ బీలోని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు. నారపల్లిలోని సీపీఆర్‌ఐ దగ్గర సర్వీస్ రోడ్డు పనులు కంపెనీ స్టార్ట్ చేసింది.
ఈ రోడ్ మీదుగా ట్రాఫిక్‌ను అనుమతించి ఫ్లై ఓవర్ పనులు చేపట్టనుంది. త్వరలో ర్యాంప్ నిర్మాణం, పిల్లర్ల పనులను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 44 శాతం పనులే పూర్తయ్యాయని, పిల్లర్లు పూర్తి చేసి శ్లాబులు వేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. 147 శ్లాబ్‌లు వేయాల్సి ఉండగా, 37 మాత్రమే పూర్తయినట్లు తెలిపారు. ఏడాదిన్నరలో ఈ పనులను మొత్తం పూర్తి చేయాలని కంపెనీకి అధికారులు గడువు విధించారు.