ఐదేండ్లుగా పిల్లర్ల దశలోనే..ఉప్పల్​- నారపల్లి పనులు

  • ఎక్కడికక్కడ తవ్వడంతో గుంతలమయంగా రోడ్లు
  •  డైలీ నరకం చూస్తున్న వాహనదారులు
  •  షాపులు, ఇండ్లలోకి దుమ్ము

హైదరాబాద్, వెలుగు: ఉప్పల్ నుంచి నారపల్లి రూట్ లో ప్రయాణించేవారు డైలీ నరకం చూస్తున్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు మొదలుపెట్టిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ పనులు నెమ్మదిగా సాగుతుండటంతో జనాలకు తిప్పలు తప్పడం లేదు. శంకుస్థాపన చేసి ఐదేండ్లవుతున్నా ఇప్పటివరకు పనులు పిల్లర్ల దశలోనే ఉన్నాయి.  దీంతో ఆ రూట్​లో ట్రాఫిక్ సమస్య తీరకపోగా ఆగి ఆగి సాగుతున్న పనులతో  ఇబ్బందులు ఎక్కువవుతున్నాయని జనం వాపోతున్నారు. ఫ్లై ఓవర్​పనుల కోసం తవ్విపోసిన మట్టితో పాటు రోడ్లపై గుంతలు, వెహికల్స్ రాకపోకలు సాగిస్తున్న సమయంలో లేస్తున్న దుమ్ము ధూళితో  అనారోగ్య సమస్యల బారిన పడుతున్నామని చెబుతున్నారు.  ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు 2018లో ఉప్పల్ నుంచి నారపల్లి వరకు రూ.626.76 కోట్ల అంచనాతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టారు. రామాంతపూర్ నుంచి నారపల్లి సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వరకు  ఈ ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ కు ఇరువైపులా 150 అడుగుల విస్తీర్ణంలో సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతేడాది నాటికే ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నా పనులు ఇంకా పిల్లర్ల దశలోనే ఉన్నాయి. కొన్ని చోట్ల పిల్లర్ల కోసం తవ్వి వదిలేయడంతో గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఈ రూట్ లో వెళ్లడం ఇబ్బందిగా మారిందని వాహనదారులు అంటున్నారు. ఎలివేటెడ్ కారిడార్ పనుల వల్ల ప్రతి రోజు ఇబ్బంది పడుతున్నామని స్థానికులు, వాహనదారులు వాపోతున్నారు. రోడ్డుకు ఇరువైపుల ఉన్న షాపుల్లోకి, చుట్టుపక్కల ఇండ్లలోకి  దుమ్ము చేరుతోందని వ్యాపారులు, స్థానికులు చెబుతున్నారు. 

ట్రాఫిక్ తిప్పలు..

యాదాద్రి, వరంగల్ వైపు నుంచి వచ్చిపోయే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు ఈ రూట్​లోనే  రాకపోకలు సాగిస్తుంటాయి. డైలీ దాదాపు 30 వేల నుంచి 40 వేల వెహికల్స్ ప్రయాణిస్తుంటాయి. దీంతో ఈ రూట్​లో  ట్రాఫిక్ సమస్యలు క్లియర్ చేయడానికి  ప్రారంభించిన ఎలివేటెడ్ కారిడార్​ పనులు ట్రాఫిక్ ఇంకా పెరగడానికి కారణమవుతున్నాయి. రోడ్లు సరిగా లేకపోవడం, ఎక్కడికక్కడ గుంతలతో ఉండటంతో వెహికల్స్ అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గుంతల రోడ్ల వల్ల ప్రతిరోజు ట్రాఫిక్ కి.మీ వరకు నిలిచిపోతోంది. ముఖ్యంగా ఉప్పల్ క్రాస్​రోడ్, నల్లచెరువు కట్ట, కట్టమైసమ్మ టెంపుల్​ ప్రాంతాల్లో సమస్య ఎక్కువగా ఉంటోంది. ఈ రూట్​లో హాస్పిటల్స్ కూడా ఎక్కువగా ఉండటంవల్ల అంబులెన్స్ వెళ్లేందుకు సైతం ఇబ్బందిగా మారింది.  మాములుగా ఉప్పల్ నుంచి బోడుప్పల్​కు 2 నుంచి 3 నిమిషాల్లో చేరాల్సి ఉండగా.. ప్రస్తుతం 15 నుంచి 20 నిమిషాలు పడుతోందని వాహనదారులు చెబుతున్నారు. పీక్​ అవర్స్​లో అరగంటకు పైనే పడుతోందని అంటున్నారు.

ఫ్లై ఓవర్ ఎత్తును మరింత పెంచి..

రామాంతాపూర్ నుంచి ప్రారంభమవుతున్న ఈ ఎలివేటెడ్ కారిడార్ ఉప్పల్ మెట్రో లైన్ పై నుంచి నిర్మించాల్సి ఉంది. అయితే మొదట నిర్ణయించిన దానికంటే కారిడార్​ ఎత్తును మరింతగా పెంచాలని అధికారులు నిర్ణయించారు. పెంచిన ఎత్తుకు అనుగుణంగా స్టీలు, ఇతర మెటీరియల్ ఖర్చు పెరగడంతో పనుల్లో  ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. సర్వీస్ రోడ్ల కోసం ఇరువైపుల ఉన్న వారి నుంచి భూసేకరణ చేశారని, ఉప్పల్ నుంచి నల్లచెరువు కట్టవరకు 220 మంది బాధితులు ఉన్నారని ఉప్పల్ మాజీ కౌన్సిలర్ అశోక్ తెలిపారు. తాత్కాలికంగా రోడ్ల పక్కన షాపులు ఏర్పాటుచేసుకున్నామని, అధికారికంగా ఇవ్వలేదని స్థలం కోల్పోయిన వ్యాపారులు చెబుతున్నారు.