ఉప్పల్​ స్టేడియంలో ఏడు మ్యాచ్​లు కాదు.. అంతకు మించి

ఉప్పల్​ స్టేడియంలో ఏడు మ్యాచ్​లు కాదు.. అంతకు మించి
  • ఉప్పల్​ స్టేడియంలో ఈసారి 9 ఐపీఎల్​ మ్యాచ్​లు
  • 7 లీగ్ ​మ్యాచ్​లతోపాటు క్వాలిఫైర్1, ఎలిమినేటర్ ​మ్యాచ్​లు
  •  రేపు రాజస్థాన్ రాయల్స్​తో సన్​రైజర్స్ హైదరాబాద్ ఢీ
  • స్టేడియంలోని ఏర్పాట్లను పరిశీలించిన రాచకొండ సీపీ సుధీర్​బాబు
  • 2,700 మంది పోలీస్​ సిబ్బంది.. 450 సీసీ కెమెరాలతో నిఘా
  • 39 వేల సీటింగ్​ కెపాసిటీ 

ఉప్పల్, వెలుగు: సిటీలోని ఉప్పల్​ రాజీవ్​గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్​స్డేడియం ఐపీఎల్ మ్యాచ్​లకు సిద్ధమైంది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఉప్పల్​వేదికగా 7 లీగ్​మ్యాచ్​లు జరగనున్నాయి. వీటితోపాటు క్వాలిఫైర్–1, ఎలిమినేటర్​మ్యాచ్ లను హైదరాబాద్​లో నిర్వహించనున్నారు. దీంతో సన్​రైజర్స్​హైదరాబాద్​ఫ్యాన్స్ తోపాటు క్రికెట్​లవర్స్​ఖుషీ అవుతున్నారు. చాలా ఏండ్ల తర్వాత మొత్తం 9 మ్యాచ్​లు జరుగుతుండడంతో ప్రత్యేక జోష్​నెలకొంది. 

 ఇప్పటికే ఆన్​లైన్ లో పెట్టిన మొదటి రెండు మ్యాచ్​ల టికెట్లు హాట్​కేకుల్లా అమ్ముడుపోయాయి. ఐపీఎల్ ఫస్ట్​మ్యాచ్ శనివారం కోల్​కతాలోని ఈడెన్​గార్డెన్స్​వేదికగా జరగనుండగా, రెండో మ్యాచ్ ఆదివారం ఉప్పల్ లో జరగనుంది. సన్​రైజర్స్​హైదరాబాద్ టీమ్ రాజస్థాన్​రాయల్స్​టీమ్​తో తలపడనుంది. వారం కిందటే సిటీకి చేరుకున్న హైదరాబాద్​టీమ్​ఆటగాళ్లు నెట్స్​లో ప్రాక్టీస్​చేస్తున్నారు.

ఫస్ట్​మ్యాచ్​మధ్యాహ్నం 3.30 గంటలకే..

ఐపీఎల్​మ్యాచ్​లకు ఉప్పల్​స్టేడియంలో చేసిన ఏర్పాట్లను రాచకొండ సీపీ సుధీర్ బాబు శుక్రవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 2,700 మంది పోలీస్​సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చీమ చిటుక్కుమన్నా తమకు తెలిసిపోతుందన్నారు. ఎస్ఓటీ, సైబర్ క్రైమ్, ఆప్టోపస్ బలగాలు బందోబస్తులో ఉంటాయన్నారు. స్టేడియంలో 39వేల మంది సీటింగ్​కెపాసిటీ ఉందని చెప్పారు. స్టేడియం లోపల, బయట  మొత్తం 450 సీసీ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు. ట్రాఫిక్​ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 19 చోట్ల పార్కింగ్​సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు.  

బ్లాక్ లో టిక్కెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్పెషల్​ఫోర్స్​తోపాటు సీసీ కెమెరాలతో నిఘా స్టేడియం పరిసరాల్లో నిఘా ఉంటుందన్నారు. మ్యాచ్​అయిపోయాక పోలీసులు సూచించిన మార్గంలోనే వెళ్లాలన్నారు. ఆర్టీసీ బస్సులతోపాటు, మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయన్నారు. స్టేడియంలోకి లాప్ టాప్స్, బ్యానర్లు, వాటర్ బాటిల్స్, కెమెరాలు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, హెల్మెట్లు, బ్యాగ్స్, బయట ఫుడ్ నిషేధమని స్పష్టం చేశారు. ఫ్లాగ్స్ కర్రలను కూడా అనుమతించబోమని, కేవలం సెల్​ఫోన్ కు మాత్రమే అనుమతి ఉందని వెల్లడించారు. ప్రతి మ్యాచ్​కు 2 గంటల ముందు నుంచి ఫ్యాన్స్​ను స్టేడియంలోకి అనుమతిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, మల్కాజిగిరి డీసీపీ పద్మజారాణి, ఉప్పల్ ఏసీపీ చక్రపాణి, ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి, స్టేడియం సిబ్బంది పాల్గొన్నారు.

హైదరాబాద్​వేదికగా జరిగే మ్యాచ్​లు

ఈ నెల 23న రాజస్థాన్, 27న లక్నో, వచ్చే నెల 6న గుజరాత్, 12న పంజాబ్, 23న ముంబై, మే 5న ఢిల్లీ, 10న కోల్​కతా టీమ్స్​తో ఉప్పల్​స్టేడియంలో సన్ రైజర్స్​హైదరాబాద్​టీమ్​తలపడనుంది. వీటితోపాటు ఉప్పల్​వేదికగా మే 20న క్వాలిఫైర్1; 21న ఎలిమినేటర్​మ్యాచ్​లు జరగనున్నాయి.