
ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాలో దారుణ ఘటన జరిగింది. అమర్నాథ్ అనే పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు.చెరుకుపల్లి మండలం రాజోలు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమర్నాత్ స్నేహితులు వెంకటేశ్వర్ రెడ్డి మరికొందరితో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారు.
ఘటనకు సంబంధించిన వివరాలు..
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజోలు గ్రామ పంచాయతీ పరిధిలోని ఉప్పలవారిపాలెంకు చెందిన ఉప్పల అమర్నాథ్ స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అతడు రోజూ పొద్దున్నే రాజోలులో ట్యూషన్‌కు వెళుతున్నాడు. ఎప్పటిలాగే జూన్ 16వ తేదీ శుక్రవారం ఉదయం కూడా ట్యూషన్ కు వెళ్లాడు. మార్గం మధ్యలో రెడ్లపాలెం వద్ద అమర్నాథ్ స్నేహితుడు వెంకటేశ్వర్ రెడ్డి.. మరికొంతమందితో కలిసి అతడిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు.
కాపాడాలంటూ హాహా కారాలు..
మంటలు అంటుకున్న అమర్నాథ్..తనను కాపాడాలంటూ అరవడంతో స్థానికులు వచ్చి మంటలు ఆర్పివేశారు. అనంతరం బాలుడిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అమర్నాథ్ చనిపోయాడు. అయితే తనపై స్నేహితుడు వెంకటేశ్వర్ రెడ్డి, మరికొందరు పెట్రోల్ పోసి నిప్పంటించారని చనిపోయేముందు పోలీసులకు అమర్నాథ్ వాంగ్మూలం ఇచ్చాడు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఎందుకు నిప్పటించాడు..
అమర్నాథ్ సోదరిని వెంకటేశ్వరరెడ్డి అనే బాలుడు వేధిస్తున్నాడని మృతుడి తాత రెడ్డయ్య తెలిపారు. దీనిపై అమర్నాథ్ నిలదీయడంతోనే వెంకటేశ్వర్ రెడ్డి కక్ష పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు. అమర్నాథ్ పై వెంకటేశ్వర్ రెడ్డి గతంలోనూ దాడి చేశాడని తెలిపారు. దీనిపై తాము వెంకట్‌రెడ్డిని మందలించామని...వెంకటేశ్వరెడ్డి తల్లిదండ్రులకు కూడా చెప్పామన్నారు. దీనిపై మరింత కక్షపెంచుకుని మళ్లీ అమర్నాథ్ పై వెంకటేశ్వర్ రెడ్డి దాడి చేసినట్లు వివరించారు.