హైదరాబాద్: ఎన్నో వేలాలు జరుగుతుంటాయి. కానీ కోర్టులోనే వేలం పాట జరగడం ఎప్పుడైనా చూశారా..? కనీసం విన్నారా..? కానీ ఓ వ్యక్తి కోర్టులో జరిగిన వేలం పాటలో ఓ పందెం కోడిని దక్కించుకున్నాడు. అనుమతి లేకుండా కోడి పందేలు నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు ఈ నెల 25వ తేదీన అత్తాపూర్‌లోని ఉప్పరపల్లి కోర్టులో నిందితులతో పాటు పందెం కోడిని కూడా కోర్టులో ప్రవేశ పెట్టారు.
అయితే నిందితులకు జరిమానా విధించడంతో పాటు కోడిని ఏం చేయాలనే ఆలోచనతో జడ్జి వేలం పాటకు ఆదేశించారు. వెంటనే ఆ వేలంలో పదుల సంఖ్యలో ఆసక్తి ఉన్న వారు పాల్గొన్నారు. అదే సమయంలో వేరే పనిపై కోర్టుకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రామకృష్ణ వేలంలో పాల్గొని ఆ కోడిని 2,300లకు దక్కించుకున్నారు.
ALSO READ | రిపబ్లిక్ డే గూగుల్ స్పెషల్ డూడుల్..ట్రెడిషనల్ డ్రెస్లో వన్యప్రాణుల పరేడ్
బంజారాహిల్స్‌లో ఈ సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ కోడిని దక్కించుకున్నరామకృష్ణతో పాటు పందెం కోడిని సత్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. తనకు మూగ జీవాలు అంటే ఇష్టమని, ఎవరైనా ఈ కోడిని వేలంలో కొనుక్కుంటే ఎక్కడ చంపేసి తినాస్తారేమో అని భయమేసి తాను కూడా వేలంలో పాల్గొని కోడిని దక్కించుకున్నానని చెప్పారు. ఎంత రేటుకైనా దీనిని కొనుగోలు చేసేవాడినని తెలిపారు. తనకు ఫామ్ హౌజ్ ఉందని అక్కడ ఉన్న ఇతర జీవాలతో పాటు దీన్ని కూడా అల్లారుముద్దుగా పెంచుకుంటానని చెప్పుకొచ్చారు.