రోడ్డు వేయకుంటే ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టడిస్తాం

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామస్తులు వినూత్న నిరసన చేశారు. గ్రామంలో అధ్వానంగా మారిన రోడ్లతో ఇబ్బందులు పడుతున్న జనం ఆందోళనకు దిగారు. తమ ఊరికి రోడ్డు నిర్మించాలని డప్పు కళాకారులతో ర్యాలీ నిర్వహించారు. చెన్నారావుపేట నుండి ఉప్పరపల్లికి వచ్చే రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గర్భిణులు ఆ రోడ్డుపై ప్రయాణం చేయలేక నరకం అనుభవిస్తున్నారని వాపోయారు. రోడ్డు సమస్య పరిష్కరించకుంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని గ్రామస్థులు హెచ్చరించారు.