8 ఏండ్లుగా కొనసాగుతున్న అప్పర్ మానేరు పనులు

8 ఏండ్లుగా కొనసాగుతున్న అప్పర్ మానేరు పనులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 80 వేల ఎకరాలకు నీరిచ్చేందుకు చేపట్టిన పనులు ఏండ్లు గడుస్తున్నా పూర్తవడం లేదు. మిడ్ మానేరును మల్కపేట రిజర్వాయర్ తో లింక్ చేసి అప్పర్ మానేరును ఎత్తిపోతల ద్వారా నింపేందుకు జరుగుతున్న పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. 9వ ప్యాకేజీ తర్వాత ప్రారంభించిన 10,11,12 ప్యాకేజీ పనులు పూర్తయ్యాయి. కానీ సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల భూములను సస్యశ్యామలం చేసే 9వ ప్యాకేజీ పనులు మాత్రం నత్తను తలపిస్తున్నాయి.

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల అప్పర్ మానేరును ప్రాణహిత – చేవెళ్లలో భాగంగా నింపేందుకు 2008లో అప్పటి కాంగ్రెస్​ప్రభుత్వం రూ. 470 కోట్ల అంచనా వ్యయంతో ప్లాన్​రెడీ చేసింది. మొత్తం 80 వేల ఎకరాలకు నీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. భూసేకరణ తర్వాత 2012లో పనులు ప్రారంభించింది. 2014లో టీఆర్ఎస్​ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీన్ని రీ డిజైన్​చేసి కాళేశ్వరం ప్రాజెక్టులోకి మార్చింది. అంచనా వ్యయాన్ని రూ. 1,468 కోట్లకు పెంచింది. మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరులోకి నీటిని ఎత్తిపోసేందుకు 9వ ప్యాకేజీలో భాగంగా 3 టీఎంసీల సామర్థ్యంతో  మల్కపేట రిజర్వాయర్ నిర్మించారు. మిడ్ మానేరు నుంచి ధర్మారం వరకు 12 కిలోమీటర్ల మేర టన్నెల్ ద్వారా సర్జ్​పూల్ నింపేందుకు స్టేజీ 1 పనులు జరుగుతున్నాయి. కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల చెరువులతోపాటు అప్పర్ మానేరును నింపే పనులు మందకొడిగా సాగుతున్నాయి. కాళేశ్వరం నుంచి మిడ్ మానేరు, సిరిసిల్ల మీదుగా సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ వరకు నీటిని తరలించే పనులు చకచకా పూర్తి చేశారు. హరీశ్​రావు, కేసీఆర్ నియోజకవర్గాలకు నీళ్లు తీసుకుపోయే ప్రాజెక్ట్ లు త్వరగా పూర్తి చేశారని, సిరిసిల్లను సస్యశ్యామలంగా మార్చే 9వ ప్యాకేజీ పనులు మాత్రం స్లోగా చేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 

కెనాల్ పనుల్లో తీవ్ర జాప్యం

కెనాల్ ద్వారా137  చెరువులను నింపుతూ 27వేల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు చేపట్టిన పనుల్లో  తీవ్ర జాప్యం జరుగుతోంది. కోనరావుపేట మండలంలోని మల్కపేట వద్ద నిర్మించిన రిజర్వాయర్ నుంచి వివిధ మండలాల్లోని గ్రామాలకు సాగు నీరు అందించడానికి కెనాల్స్ నిర్మిస్తున్నారు. కుడి కాలువ 12 కిలోమీటర్లు మేర తవ్వుతున్నారు. అయితే కుడి కాలువ ఇప్పటివరకు 8 కిలోమీటర్లు మాత్రమే పూర్తయ్యింది. సిరిసిల్లలోని బోనాల, ముష్టిపల్లి, పెద్దూర్, సిరిసిల్ల, ధర్మారం, కనగర్తి, కొలనూర్, మక్తపల్లి, మలక్​పేట్​, మర్తనపేట్, నాగారం, నిజామాబాద్, రామన్నపేట్, సుద్దాల, వేములవాడ మండలంలోని చంద్రగిరి, జయవరం, లింగంపల్లి, మారుపాక గ్రామాలకు కుడి కాలువ ద్వారా సాగు నీరు అందివ్వడానికి పనులు జరుగుతున్నాయి. ఎడమ కాలువ ద్వారా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్, వెంకట్రావుపేట్, కోనరావుపేట, కొండాపూర్ గ్రామాలకు నీరందించడానికి ప్లాన్ రెడీ చేశారు. కానీ ఎడమ కాల్వ నిర్మాణానికి ఇంకా భూసేకరణ జరగలేదు. 

నిండుకుండలా మానేరు

వర్షాలు పడ్డప్పుడల్లా మానేరు నిండుకుండను తలపిస్తోంది. కూడెల్లి, పాల్వంచ వాగుల  ద్వారా వచ్చే నీటితో  మానేరు నిండుతోంది. వర్షాలు పడ్డప్పుడు మాత్రమే మానేరు కింద ఉన్న ఆయకట్టు సస్యశ్యామలం అవుతోంది. వర్షాలు ఉన్నా లేకున్నా 9వ ప్యాకేజీ ద్వారా మిడ్ మానేరు నుంచి నీటిని ఎత్తిపోస్తే ఏడాదికి రెండు పంటలు పండించవచ్చని రైతులు గంపెడాశతో ఉన్నారు. 9వ ప్యాకేజీ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. 

పనులు త్వరగా పూర్తి చేయాలి    

ప్రాజెక్ట్ పనులను త్వరగా పూర్తి చేసి రైతులకు రెండు పంటలకు నీళ్లు ఇవ్వాలి. అప్పర్ మానేరు నింపితే రెండు పంటలు పండించొచ్చు.  ప్రస్తుతం వర్షాకాలంలో మాత్రమే పంటలు పండుతున్నాయి. ఏండ్లుగా పనులు సాగుతూనే ఉన్నాయి. మల్కపేట రిజర్వాయర్ చూడటానికి నెలకో ఆఫీసర్ వస్తుండు. కానీ పనులు మాత్రం పూర్తి చేయడం లేదు. 
- శ్రీనివాస్ యాదవ్, రైతు, ధర్మారం

డిసెంబర్ వరకు కంప్లీట్ చేస్తం

మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరుకు నీటిని ఎత్తిపోసేందుకు జరుగుతున్న పనులు డిసెంబర్ వరకు పూర్తవుతాయి. ప్రస్తుతం 9వ ప్యాకేజీ పనులు వేగవంతం చేశాం. వేములవాడ, సిరిసిల్ల నియోజవర్గాల్లోని వివిధ గ్రామాలకు నీరివ్వడానికి చేపట్టిన కాలువ పనుల్లో కుడి కాలువ పని 90 శాతం పూర్తయ్యింది. ఎడమ కాలువ కోసం భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది.
- శ్రీనివాస్ రెడ్డి, ఇరిగేషన్ ఈఈ, 9వ ప్యాకేజీ
.