ఖేద్కర్​పై కేసు నమోదు.. 

ఖేద్కర్​పై కేసు నమోదు.. 
  • డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసినట్టు గుర్తించిన యూపీఎస్సీ
  • ఆమె సివిల్స్ అభ్యర్థిత్వం రద్దు చేసేందుకూ చర్యలు 

న్యూఢిల్లీ: ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్ కు బిగ్ షాక్ తగిలింది. ఆమెపై కేసు నమోదైంది. పూజా ఖేద్కర్ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసినట్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) గుర్తించింది. దీంతో ఆమెపై ఢిల్లీ పోలీసులకు కంప్లయింట్ చేసింది. యూపీఎస్సీ ఫిర్యాదు మేరకు పూజా ఖేద్కర్​పై ఫోర్జరీ, చీటింగ్, ఐటీ యాక్ట్, డిజెబిలిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు.

ఖేద్కర్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపినట్టు యూపీఎస్సీ శుక్రవారం తెలిపింది. ‘‘పూజా ఖేద్కర్ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఆమె తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫొటో/సంతకం, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, అడ్రస్ మార్చి.. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్​ను క్లియర్ చేసేందుకు మోసపూరిత ప్రయత్నాలకు పాల్పడింది. దీంతో ఆమెపై చర్యలు చేపట్టాం. పోలీసులకు ఫిర్యాదు చేశాం” అని యూపీఎస్సీ ప్రకటనలో పేర్కొంది.

అంతేకాకుండా ఆమెకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలిపింది. ఆమె సివిల్ సర్వీసెస్ అభ్యర్థిత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదో, భవిష్యత్తులో మళ్లీ ఎగ్జామ్స్ రాయకుండా ఎందుకు డిబార్ చేయకూడదో చెప్పాలంటూ నోటీసులు ఇచ్చామని చెప్పింది. దీనిపై పూజ ఇచ్చే వివరణ ఆధారంగా చర్యలు తీసుకోనుంది.

ఇప్పటికే ట్రైనింగ్ నిలిపివేత.. 

పూజా ఖేద్కర్ 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్. ఆమెపై అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, తన హోదాకు మించిన సౌలతులు కోరారని, తప్పుడు డిజెబిలిటీ, ఓబీసీ సర్టిఫికెట్లు సమర్పించి సివిల్స్ కు ఎంపికయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఖేద్కర్ ట్రైనింగ్​ను నిలిపివేస్తూ యూపీఎస్సీ ఆదేశాలు ఇచ్చింది.

ఆమెను తిరిగి ముస్సోరిలోని అకాడమీకి పిలిపించింది. కాగా, ఖేద్కర్ నకిలీ డిజెబిలిటీ, ఓబీసీ సర్టిఫికెట్లు సమర్పించారనే ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు కేంద్రం ఈ నెల 11న ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. రెండు వారాల్లోగా రిపోర్టు అందజేయాలని కమిటీ హెడ్ మనోజ్ కుమార్ ద్వివేదిని ఆదేశించింది.