వక్ఫ్ చట్టంపై రచ్చ.. దద్దరిల్లిన జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ

వక్ఫ్ చట్టంపై రచ్చ.. దద్దరిల్లిన జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ

శ్రీనగర్: వక్ఫ్ చట్టంపై సోమవారం జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ దద్దరిల్లింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా రూలింగ్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. సభ వెల్‎లోకి దూసుకెళ్లి మోడీ సర్కారు తీరును తీవ్రంగా ఎండగట్టారు. వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలన్న డిమాండ్‎ను స్పీకర్  తిరస్కరించడంతో ఆగ్రహం చేస్తూ వక్ఫ్ చట్టం కాపీలను చింపేశారు. వక్ఫ్ చట్టంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసులు దాఖలయ్యాయని, వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున వాయిదా తీర్మానం ద్వారా వక్ఫ్ చట్టంపై చర్చించలేమని స్పీకర్  అబ్దుల్ రహీం పేర్కొన్నారు. 

నిబంధనలు 56, 58(7) ఇందుకు ఒప్పుకోవని ఆయన తెలిపారు. అయితే, ఎమ్మెల్యేలు అదేపనిగా నిరసనలు వ్యక్తం చేస్తుండడంతో సభను స్పీకర్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాలని ఎన్సీ ఎమ్మెల్యేలు డిమాండ్  చేశారు. స్పీకర్  వారి డిమాండ్ ను తిరస్కరించడంతో ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. వక్ఫ్​ చట్టం కాపీలను చించేశారు. ఎన్సీ ఎమ్మెల్యే అబ్దుల్ మజీద్ లర్మీ తన జాకెట్‎ను చింపుకొని నిరసన తెలిపారు.

‘‘వక్ఫ్​చట్టంతో మా మతపరమైన సెంటిమెంట్లు దెబ్బతిన్నాయి. కాబట్టే, నేను నా జాకెట్‎ను చించుకున్నా. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నట్లే ఈ చట్టాన్ని కూడా మోదీ సర్కారు వెనక్కి తీసుకోవాలి” అని లర్మీ పేర్కొన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరును ప్రతిపక్ష నేత సునీల్  శర్మ తప్పుపట్టారు. రూలింగ్  పార్టీ డిమాండ్ రాజ్యాంగానికి విరుద్ధం అని పేర్కొన్నారు.

‘‘పార్లమెంటు వక్ఫ్​బిల్లు పాస్  చేసింది. రాష్ట్రపతి ఆమోదంతో అది చట్టరూపం దాల్చింది. మరోవైపు ఈ చట్టంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగా వాయిదా తీర్మానం ఎలా ప్రవేశపెడతారు?” అని సునీల్  అన్నారు. పీడీపీ చీఫ్​ మెహబూబా ముఫ్తీ స్పందిస్తూ.. బీజేపీ ముస్లిం వ్యతిరేక అజెండాకు రూలింగ్  పార్టీ పూర్తిగా లొంగిపోయిందని విమర్శించారు.