
- డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష సభ్యుల నిరసనలు
- రూల్స్ పాటించడం లేదంటూ స్పీకర్ సీరియస్
- రాజ్యసభలోనూ అపొజిషన్ ఎంపీల ఆందోళనలు
న్యూఢిల్లీ:లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు గురువారం పార్లమెంట్‌లో ఆందోళన చేశారు. అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలోనూ నిరసన తెలిపారు. డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూ నినాదాలు రాసి ఉన్న టీషర్టులను వేసుకుని డీఎంకే ఎంపీలు సభలకు హాజరయ్యారు.
అటు లోక్‌సభ స్పీకర్, ఇటు రాజ్యసభ చైర్మన్ చెప్పినా వినకుండా ఆందోళన చేశారు. దీంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడుతూ వచ్చాయి. చివరకు రెండు సభలనూ శుక్రవారానికి వాయిదా వేశారు. కాగా, పార్లమెంట్ బయట కూడా డీఎంకే ఎంపీలు నిరసన తెలిపారు.
ఉభయసభల్లో ఆందోళనలు..
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టవద్దని, అలా చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని డీఎంకే ఎంపీలు లోక్‌సభలో ఆందోళన చేశారు. వాళ్లంతా నినాదాలు రాసి ఉన్న టీషర్టులు వేసుకుని సభకు వచ్చారు. వాటిపై ‘‘డీలిమిటేషన్ పారదర్శకంగా చేపట్టాలి.. తమిళనాడు పోరాడుతుంది.. తమిళనాడు గెలుస్తుంది” అనే నినాదాలు రాసి ఉన్నాయి. అయితే ఇలా టీషర్టులు వేసుకుని సభకు రావడంపై స్పీకర్ ఓంబిర్లా సీరియస్ అయ్యారు.
‘‘కొంతమంది ఎంపీలు పార్లమెంట్ నియమాలు పాటించడం లేదు. సభ గౌరవాన్ని కాపాడడం లేదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలా నినాదాలు రాసి ఉన్న టీషర్టులు వేసుకుని వస్తే, సభను ఎలా నిర్వహిస్తాం? సభను నిర్వహించాలంటే మీరంతా టీషర్టులు విప్పేసి, వేరే బట్టలు వేసుకొని రండి” అని చెప్పారు. సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అయితే ఆ తర్వాత కూడా సభ్యులు ఆందోళన కొనసాగించడంతో సభను చివరికి శుక్రవారానికి వాయిదా వేశారు.
ఇక రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. డీఎంకే ఎంపీల ఆందోళనతో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సభను మొదట మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఎంపీలు నిరసన కొనసాగించడంతో చివరికి శుక్రవారానికి వాయిదా వేశారు.
విదేశీ జైళ్లలో ఈ10 వేల మంది మనోళ్లు..
విదేశీ జైళ్లలో మనోళ్లు10,152 మంది ఉన్నారని కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. వీరిలో అండర్ ట్రయల్ ఖైదీలు, శిక్ష పడినోళ్లు ఉన్నారని తెలిపింది. కొన్ని దేశాల్లో మరణశిక్షలు కూడా విధించారని.. వీరిలో యూఏఈలో 25 మంది, సౌదీ అరేబియాలో 11 మంది, మలేసియాలో ఆరుగురు, కువైట్‌లో ముగ్గురు, ఇండోనేషియా, ఖతార్, అమెరికా, యెమెన్‌లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారని వివరించింది.
వీళ్లందరికీ అవసరమైన సాయం అందజేస్తున్నామని చెప్పింది. ఇక 2024లో కువైట్, సౌదీ అరేబియాలో ముగ్గురు భారతీయులకు, జింబాబ్వేలో ఒక్కరికి ఉరిశిక్ష అమలు చేశారని.. 2023లో కువైట్, సౌదీ అరేబియాలో ఐదుగురికి, మలేసియాలో ఒక్కరికి ఉరిశిక్ష అమలు చేశారని వెల్లడించింది.