
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్1 నుంచి యూనిఫైడ్ పింఛన్ స్కీమ్ అమలు చేయడం ఉద్యోగులను మోసం చేయడమేనని నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పింఛన్ స్కీమ్ (ఎన్ఎంఓపీఎస్) సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ తెలిపారు. యూపీఎస్ విధానం రద్దు చేసి.. ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, ట్రెజరర్ నరేశ్ గౌడ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఉద్యోగుల నుంచి కంట్రిబ్యూషన్ వసూలు చేసి పింఛన్ అమలు చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. కొత్తగా అమలు చేసే యూపీఎస్ విధానంతో ఇప్పటివరకూ కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ రూపంలో ఎంపీఎస్ ట్రస్ట్ ద్వారా జమ అయిన రూ.10.5 లక్షల కోట్ల నిధులు కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లనున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం మరోసారి ఉద్యోగుల సంక్షేమం, కుటుంబ సామాజిక భద్రత ఆలోచించకుండా కేవలం స్టాక్ మార్కెట్ ద్వారానే ఉద్యోగి భవితవ్యాన్ని నిర్ణయించే యూపీఎస్ విధానం సరికాదన్నారు. రాజ్యాంగం ఆర్టికల్ 21 ద్వారా కంట్రిబ్యూషన్ లేని పింఛన్ ఒక హక్కుగా ఉందని గుర్తుచేశారు. యూపీఎస్ పింఛన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు.