
డిగ్రీ పూర్తి చేసి ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఆఫీసర్‌గా పనిచేయాలనుకునే వారికి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ మంచి అవకాశం. ఇందులో విజయం సాధిస్తే త్రివిధ దళాల్లో ఉన్నత భవిష్యత్ సొంతం చేసుకోవచ్చు. ఇటీవలే యూపీఎస్సీ సీడీఎస్ 2022 (1)కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎగ్జామ్ ప్యాటర్న్, సెలెక్షన్ ప్రాసెస్, ప్రిపరేషన్, కెరీర్ అవకాశాలు తెలుసుకుందాం..
దేశంలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ల స్వప్నం సర్కారీ కొలువు. ఇందుకోసం లక్షల మంది ఏటా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు. త్రివిధ దళాల్లోని నాలుగు విభాగాల్లో ఆఫీసర్ కేడర్ పోస్ట్‌ల భర్తీకి నిర్వహించే పరీక్ష సీడీఎస్‌ఈ. బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో యూపీఎస్సీ ప్రతి ఏటా రెండుసార్లు ఈ పరీక్ష నిర్వహిస్తుంది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌పై అవగాహన పెంచుకొని, ప్రాక్టీస్ చేస్తే పరీక్షలో సక్సెస్ కావొచ్చు.
పోస్టులు: త్రివిధ దళాలకు చెందిన నాలుగు అకాడమీల్లోని 341 పోస్టులు భర్తీ చేస్తారు.
అర్హతలు: ఇండియన్ మిలిటరీ అకాడమీకి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి. 1999 జనవరి 2 నుంచి 2004 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. నేవల్ అకాడమీలో చేరడానికి బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. 1999 జనవరి 2 నుంచి 2004 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో జాయినింగ్‌కు డిగ్రీ లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ చదివుండాలి. 2 జనవరి 1999 నుంచి 1 జనవరి 2003 మధ్య జన్మించి ఉండాలి. డీజీసీఏ జారీచేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారికి రెండేళ్ల సడలింపు లభిస్తుంది. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 2 జనవరి 1998 నుంచి 1 జనవరి 2004 మధ్య జన్మించి ఉండాలి.
ఎగ్జామ్ ప్యాటర్న్: సీడీఎస్‌ఈ రాత పరీక్ష రెండు విధాలుగా ఉంటుంది. ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ అభ్యర్థులకు 300 మార్కులకు; ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అభ్యర్థులకు 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. రాత పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
ఎస్‌ఎస్‌బీ ఎంపిక
రాత పరీక్షలో నిర్దేశిత కటాఫ్ మార్కులు పొందిన అభ్యర్థులకు సర్వీస్ సెలక్షన్ బోర్డ్(ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. అన్ని అకాడమీల అభ్యర్థులకు ఉమ్మడిగా అయిదు రోజులపాటు ఈ టెస్ట్ జరుగుతుంది. ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి టెస్టులను 6 రోజులపాటు నిర్వహిస్తారు. దీనికి కేటాయించిన మార్కులు 300. ఈ ఎంపిక ప్రక్రియలో భాగంగా పలు రకాల పరీక్షలు, చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆఫీసర్ ఉద్యోగాలకు సరిపోయే నైపుణ్యాలున్న అభ్యర్థులను ఖరారు చేస్తారు.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
చివరి తేదీ: 11 జనవరి 2022
సీడీఎస్ రాత పరీక్ష: 10 ఏప్రిల్ 2022
వెబ్‌సైట్: www.upsc.gov.in
సీడీఎస్ ద్వారా త్రివిధ దళాల్లో ఆఫీసర్ కేడర్ పోస్ట్‌ల భర్తీకి రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వీటిలో మొదటిది.. యూపీఎస్‌సీ నిర్వహించే సీడీఎస్ రాత పరీక్ష. ఇందులో నిర్దిష్ట కటాఫ్ మార్కులు సాధించి.. మెరిట్ జాబితాలో నిలిస్తే.. మలి దశలో ఆయా దళాలకు చెందిన సర్వీస్ సెలక్షన్ బోర్డ్‌ల ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇందులో విజయం సాధిస్తే అభ్యర్థులు ఎంచుకున్న విభాగంలో కెరీర్ సొంతం చేసుకోవచ్చు.
ఇంటర్వ్యూ
సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఎంపిక ప్రక్రియలో ఫిజికల్ టెస్ట్‌లు పూర్తయ్యాక చివరగా.. బోర్డ్ ప్రెసిడెంట్ లేదా సీనియర్ సభ్యుడి ఆధ్వర్యంలో పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆ తర్వాత కూడా చివరగా కాన్ఫరెన్స్ ఉంటుంది. ప్యానెల్ ముందు అభ్యర్థులు వేర్వేరుగా హాజరవ్వాలి. ఫ్లయింగ్ బ్రాంచ్ వారికి పీఏబీటీ ఉంటుంది. వీటిలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న విద్యార్థులకు మరోసారి శారీరక, వైద్య పరీక్షలు నిర్వహించి.. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ టెస్టుల్లో ప్రతిభ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు.
ట్రైనింగ్ .. స్టైపెండ్
అన్ని దశల ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి.. ఆయా విభాగాల్లో శిక్షణకు ఎంపికైన వారిని జెంటిల్‌మెన్ క్యాడెట్, లేడీ క్యాడెట్స్‌గా పిలుస్తారు. ఇలా శిక్షణ సమయంలో వీరికి నెలకు రూ.56,100 స్టైపెండ్ అందిస్తారు. నిర్దేశిత వ్యవధిలో ఉండే శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత లెఫ్ట్‌నెంట్ హోదాలో పర్మనెంట్ కొలువు సొంతమవుతుంది. ఇండియన్ మిలిటరీ అకాడమీ (డెహ్రాడూన్)లో 18 నెలలు; నేవల్ అకాడమీలో సుమారు 17 నెలలు; ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 18 నెలలు; ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 11 నెలలు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ పూర్తయ్యాక త్రివిధ దళాల్లో లెఫ్ట్‌నెంట్ హోదాలో కొలువు ఖాయం అవుతుంది. నేవీలో ప్రారంభంలో సబ్‌లెఫ్ట్‌నెంట్‌హోదా లభిస్తుంది. ఎయిర్‌ఫోర్స్‌లో శిక్షణ పొందిన వారు ప్రారంభంలో ఫ్లయింగ్ ఆఫీసర్‌గా విధులు చేపడతారు.
– వెలుగు, ఎడ్యుకేషన్ డెస్క్