UPSC Mains 2024 :యూపీఎస్సీ మెయిన్స్లో తెలంగాణ నుంచి 20 మంది క్వాలిఫై

  •  తెలంగాణ నుంచి పరీక్ష రాసింది 135 మంది
  • రాజీవ్ అభయహస్తం కింద రూ. లక్ష చొప్పున సాయం
  •  అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: యూపీఎస్సీ మెయిన్స్ 2024 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. ఈ ఏడాది తొలి సారిగా రాష్ట్రం నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది.  సివిల్స్​ సాధించే లక్ష్యంతో ప్రిపేరయ్యే పేద కుటుంబీకులకు అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభ‌య హ‌స్తం పథకాన్ని ఈ ఏడాది తొలిసారిగా అమలు చేసింది. సింగరేణి సంస్థ అధ్వర్యంలో 135 మందికి  రూ. ల‌క్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది.  ఈ ఏడాది ఆగస్ట్ 26న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వీరికి చెక్కులు పంపిణీ చేశారు. 

రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం అందుకున్న అభ్యర్థుల్లో 20 మంది తాజాగా యూపీఎస్సీ మెయిన్స్​ ఫలితాల్లోనూ విజేతలుగా నిలిచారు.  వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన ఈ. సాయి శివాని, రాహుల్ శంకేషి, పోతరాజు హరి ప్రసాద్, విక్రమ్ బేతి, ఖమ్మం జిల్లాకు చెందిన నల్లమల సాయికుమార్ , బానోతు నాగ రాజా నాయక్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన కడారి శ్రీవాణి, గాదె శ్వేత, రాపర్తి ప్రీతి, మెదక్ జిల్లాకు చెందిన కుమ్మరి శ్రవణ్ కుమార్, రంగారెడ్డి జిల్లాకు చెందిన మొహమ్మద్ అశ్ఫాక్, తొగరు సూర్యతేజ, మహబూబాబాద్ జిల్లాకు చెందిన బెస్త ప్రియాంజలి, సిద్ధిపేటకు చెందిన నరిగె స్వామి, నాగర్‌కర్నూలుకు చెందిన గోకమల్ల అంజనేయులు, ఆదిలాబాద్‌కు చెందిన ఆర్. ప్రమోద్ కుమార్, వికారాబాద్‌కు చెందిన బి. ప్రహ్లాద్, జగిత్యాలకు చెందిన బురుగుపెల్లి నీరజ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన జస్వంత్ కుమార్, అసిఫాబాద్-కుమ్రంభీం జిల్లాకు చెందిన రామ్టెంకి సుధాకర్ మెయిన్స్​ క్వాలిఫై అయిన జాబితాలో ఉన్నారు. రాష్ట్రం నుంచి మెయిన్స్ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.