సివిల్స్‌కు నాలుగుసార్లు ఎంపికైనా.. ఉద్యోగం ఇవ్వలే

సివిల్స్‌కు నాలుగుసార్లు ఎంపికైనా.. ఉద్యోగం ఇవ్వలే
  • మస్కులర్ డిస్ర్టోఫి ఉందని నిరాకరించిన యూపీఎస్సీ
     
  • చిన్నప్పటి నుంచే వీల్ చైర్​కు పరిమితమైన కార్తీక్ కన్సల్
  • పూజా ఖేద్కర్ వివాదం వేళ వైరల్ గా మారిన కార్తీక్ స్టోరీ

న్యూఢిల్లీ : అతనో దివ్యాంగుడు.. చిన్నప్పటి నుంచే మస్కులర్ డిస్ట్రోఫి (కండరాల బలహీనత)తో బాధపడుతున్నాడు. 14 ఏండ్ల వయసు నుంచే వీల్ చైర్ కు పరిమితమయ్యాడు. అలా అని అతనేం కుంగిపోలేదు. జీవితంలో ఏదైనా సాధించాలనే కసితో చదివాడు. సివిల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని, అందులో అర్హత సాధించాడు. ఒక్కసారి కాదు.. ఏకంగా నాలుగుసార్లు సివిల్స్‌లో ర్యాంక్ పొందాడు. కానీ ఉద్యోగం మాత్రం రాలేదు. ఆ దివ్యాంగుడి పేరు కార్తీక్ కన్సాల్. ఫేక్ డిజెబిలిటీ సర్టిఫికెట్​తో సివిల్స్ ఉద్యో గం పొందిన పూజా ఖేద్కర్ వివాదం వేళ.. అర్హుడైన కార్తీక్​కు అన్యాయం జరిగిందంటూ ఆయన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. కార్తీక్ స్టోరీని రిటైర్డ్ ఐఏఎస్ సంజీవ్ గుప్తా ట్విట్టర్​లో పోస్టు చేశారు.

నాలుగుసార్లు రిజెక్ట్.. 

కార్తీక్ కన్సాల్ ఐఐటీ రూర్కీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత సివిల్స్​కు ప్రిపేర్ అయ్యాడు. 2019లో 813వ ర్యాంక్ సాధించాడు. అప్పుడు మొత్తం 15 లోకోమోటర్ డిజెబిలిటీ ఖాళీలు ఉండగా 14 పోస్టులను భర్తీ చేశారు. కార్తీక్​కు ఉద్యోగం రావాల్సి ఉండగా రాలేదు. 2021లో కార్తీక్ 271వ ర్యాంక్ సాధించాడు. ఆ నోటిఫికేషన్​లో ఏడు లోకోమోటర్ డిజెబిలిటీ పోస్టులు ఉండగా, నాలుగింటిని భర్తీ చేశారు. 
ఆ కేటగిరీలో కార్తీక్ ఫస్ట్ ప్లేసులో ఉన్నప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదు. ఇక 2022లో 784, 2023లో 829వ ర్యాంకులు సాధించినా యూపీఎస్సీ ఉద్యోగం ఇవ్వలేదు. దీనిపై కార్తీక్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్​ను ఆశ్రయించారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. కాగా, ప్రస్తుతం కార్తీక్ ఇస్రోలో సైంటిస్ట్​గా పని చేస్తున్నాడు.  

రిజెక్షన్​కు కారణమేంటి?  

కార్తీక్ మస్కులర్ డిస్ట్రోఫితో బాధపడుతున్నాడని ఎయిమ్స్ మెడికల్ బోర్డు నిర్ధారించింది. డిజెబిలిటీ 60 శాతమేనని సర్టిఫికెట్​లో ఉంది కానీ అది 90 శాతమని పేర్కొంది.  కార్తీక్ చూడడం, వినడం, రాయడం, మాట్లాడడం అన్నీ చేయగలడు.. కానీ నిలబడలేడని తెలిపింది. యూపీఎస్సీ రూల్స్ ప్రకారం.. ఐఏఎస్​కు మస్కులర్ డిస్ట్రోఫి ఉన్నోళ్లు అనర్హులు. ‘నిపుణుల సూచన మేరకు ఫంక్షనల్, ఫిజికల్ అర్హతలను బట్టి దివ్యాంగులకు సర్వీసులను కేటాయిస్తాం. కార్తీక్​ ర్యాంక్, అర్హతలను బట్టి.. ఆయన ఏ సర్వీస్​కు సరిపోలేదు” అని యూపీఎస్సీ పేర్కొంది.