
- ఆన్‌లైన్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి
- రూ. 10 లక్షలకు పైగా అప్పు చేసిన యువకుడు
- తీర్చే మార్గం కనిపించకపోవడంతో సూసైడ్
- పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘటన
- మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు
గోదావరిఖని, వెలుగు: ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్‌లో నష్టపోయి 27 ఏండ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. గోదావరిఖని టూ టౌన్ సీఐ ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం.. మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన కోరవేణి సాయితేజ (27) గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీలో నివాసం ఉంటున్నాడు.
ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. ఇందుకోసం రూ.10లక్షలకు పైగా అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఈ నెల 18న సాయంత్రం రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామ శివారులో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తన స్నేహితుడు రవితేజకు ఫోన్ ద్వారా సూసైడ్ చేసుకుంటున్నట్టు తెలిపాడు.
దీంతో రవితేజ అక్కడికి చేరుకుని సాయితేజను మొదట గోదావరిఖని, ఆ తర్వాత కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. ట్రీట్మెంట్ తీసుకుంటూ సాయితేజ గురువారం రాత్రి మృతి చెందాడు. దీంతో పోస్ట్‌మార్టం నిమిత్తం బంధువులు మృతదేహాన్ని మంథని గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఇన్సిడెంట్ తమ పరిధిలో జరగలేదని మంథని పోలీసులు తెలపడంతో.. గోదావరిఖని టూటౌన్ పోలీసులు వెళ్లి పంచనామా నిర్వహించి, పోస్ట్‌మార్టం చేయించారు. అనంతరం స్వగ్రామం విలోచవరంలో సాయితేజ అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి భార్య దీపిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.