- గన్తో కాల్చుకుని చనిపోయిన గుడిబోయిన శ్రీనివాస్
- మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఘటన
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గుడిబోయిన శ్రీనివాస్ (56) ఆదివారం సాయంత్రం సర్వీస్ గన్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జిల్లా కేంద్రంలోని గోపాల్ రావు నగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్ 1990 ఏఆర్ బ్యాచ్ చెందిన కానిస్టేబుల్. కుటుంబ కలహాల కారణంగా మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు.
సంఘటన సమయంలో ఆయన కలెక్టరేట్లోని స్ట్రాంగ్ రూమ్ వద్ద సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. శ్రీనివాస్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడికి భార్య వరలక్ష్మి, కొడుకు సుశాంత్ ఉన్నారు. కాగా, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఇతర పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.