తలకిందులుగా భూ బాధితుడి నిరసన

తలకిందులుగా భూ బాధితుడి నిరసన
  • ధరణి పోర్టల్ లో ప్రొహిబిటెడ్ కింద నమోదైన భూమి 
  • ఇబ్రహీంపట్నం తహసీల్దార్ ఆఫీసు చుట్టూ నెలలుగా తిరుగుతూ..  
  • అధికారులు పట్టించుకోవడం లేదంటూ బాధితుడి నిరసన

రంగారెడ్డి,వెలుగు: ధరణి పోర్టల్ లోపాల కారణంగా రైతులు, భూ బాధితులు ఇంకా ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళ్ పల్లి సర్వే నంబర్ 374లోని1 ఎకరం-32 గుంటల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని 8 నెలలుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా  పని చేయడంలేదంటూ బుధవారం బాధితుడు జీవన్  తలకిందులుగా నిరసన తెలిపారు.

ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో గోల్డ్ మెడలిస్ట్ అయిన తను సొంత పొలంలో మట్టి పాత్రల తయారీ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రొహిబిటెడ్ లో ఉన్న తన భూమి సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నత చదువులు చదివిన తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. సామాన్యులకు అధికారులు ఎలా అందుబాటులో ఉంటారని ఆవేదన వ్యక్తం చేశాడు.

తన సమస్య పరిష్కరించాలంటూ ఎన్నో సార్లు తహశీల్దార్,  కలెక్టర్ ను కలిశానని, ప్రజా పాలన కూడా దరఖాస్తు చేసుకున్నామని పేర్కొన్నారు.  ఈ విషయమై ఇబ్రహీంపట్నం తహశీల్దార్ ను వివరణ కోరగా.. తన దృష్టికి ఇప్పుడే వచ్చిందని.. సమస్య పరిష్కారానికి టైమ్ పడుతుందని చెప్పారు.