
లక్నో: ఓపెనర్ బెత్ మూనీ (59 బాల్స్‌లో 17 ఫోర్లతో 96 నాటౌట్) ఖతర్నాక్ బ్యాటింగ్‌తో విజృంభించడంతో విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) గుజరాత్ జెయింట్స్ మూడో విజయం అందుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 81 రన్స్ తేడాతో యూపీ వారియర్స్‌ను చిత్తుచేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 186/5 స్కోరు చేసింది.
హర్లీన్ డియోల్ (32 బాల్స్‌లో 6 ఫోర్లతో 45) కూడా ఆకట్టుకుంది. మిగతా బ్యాటర్లు నిరాశపరిచినా.. మూనీ భారీ షాట్లతో విరుచుకుపడింది. హర్లీన్‌తో రెండో వికెట్‌కు 101 రన్స్ జోడించి జట్టుకు భారీ స్కోరు అందించింది.
యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ రెండు, చినెల్లే హెన్రీ, దీప్తి శర్మ, క్రాంతి గౌడ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఛేజింగ్‌లో యూపీ 17.1 ఓవర్లలో 105 రన్స్‌కే ఆలౌటైంది. చినెల్లే హెన్రీ (28), గ్రేస్ హారిస్ (25), ఉమా ఛెత్రి (17), ఎకిల్‌స్టోన్ (14) తప్ప మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. గుజరాత్ బౌలర్లలో కశ్వీ గౌతమ్, తనుజా కన్వార్ చెరో మూడు, దియోంద్ర డాటిన్ రెండు వికెట్లు పడగొట్టారు. మూనీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌అవార్డు లభించింది. గురువారం జరిగే తదుపరి మ్యాచ్‌లో ముంబై, యూపీ పోటీ పడతాయి.