- అడ్డువచ్చిన మరొకరిపైనా అటాక్
- అనుకోని ఘటనతో ప్రేక్షకుల పరుగులు
- కూతురిని వేధించాడనే..వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఘటన
వరంగల్/వర్ధన్నపేట, వెలుగు: కొన్ని కుటుంబాలు కలిసి సరదాగా గడిపాయి. తర్వాత భారతీయుడు సినిమా చూద్దామని వెళ్లాయి. సినిమా నడుస్తుండగా ఓ కుటుంబంలోని వ్యక్తి తన పక్కన కూర్చున్న మరో కుటుంబంలోని యువకుడిని కత్తితో పొడిచాడు. దీంతో భయపడ్డ ప్రేక్షకులు థియేటర్ బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన శుక్రవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం అమ్మాపురం
గ్రామానికి చెందిన కళ్లెం విజయ్ (21) కొన్ని నెలలుగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలోని బంధువుల ఇంట్లో ఉంటూ వర్ధన్నపేటలోని పాత ఇనుప సామాను దుకాణంలో పని చేస్తున్నాడు.
ఇదే గ్రామానికి చెందిన ఊర కృష్ణ సైతం వర్ధన్నపేటలో ఇదే వృత్తి చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం విజయ్.. ఇల్లందలోని తన ఇంటి సమీపంలో ఉండే కృష్ణ కూతురును వేధించాడు. ఇద్దరూ ఒకే సామాజికవర్గం కావడంతో పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి జరిమానా విధించారు. శుక్రవారం గ్రామానికి చెందిన వీరి కుటుంబాలు వంటల పేరుతో బయటకువెళ్లి విందు చేసుకున్నాయి.
తర్వాత మద్యం తాగారు. సరదాగా భారతీయుడు–2 సినిమా చూద్దామని విజయ్, కృష్ణతో పాటు వారి బంధువులు వర్ధన్నపేటలోని ఎస్‍వీఎస్ సినిమా టాకీస్‍లో ఫస్ట్ షోకు వెళ్లారు. 6 గంటలకు సినిమా ప్రారంభమయ్యాక.. 10 నిమిషాలకే కృష్ణ తనకు దగ్గర్లో ఉన్న విజయ్‍పై ముందస్తుగా తెచ్చుకున్న కత్తితో కడుపులో మూడుపోట్లు పొడిచాడు. అడ్డుకోడానికి వచ్చిన మరోవ్యక్తి గుర్రం రాజు(21)ను సైతం గాయపర్చాడు.
దీంతో ఏం జరుగుతుందో తెలియని ప్రేక్షకులు బయటకు పరుగులు పెట్టారు. తీవ్రంగా గాయపడ్డ విజయ్‍ని వర్ధన్నపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. కాగా, విజయ్‍పై దాడి చేసిన తర్వాత కృష్ణ గ్రామంలోకి వెళ్లి విజయ్ బంధువులపై కూడా దాడి చేశాడు. వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య, సీఐ సూర్యప్రకాశ్, ఎస్సైలు ప్రవీణ్‍కుమార్, రాజ్‍కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.