ఒక పక్క వర్షం... మరో పక్క వేడివేడిగా, కారం కారంగా శ్నాక్స్... భలే కాంబినేషన్ కదా! కాంబినేషన్ అయితే సూపర్ కానీ.. వాటిలో ఎక్కువ శాతం శెనగ, మైదా పిండి వంటివాటితో వండుతారు. ఇలాంటివి ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అరెరే పెద్ద చిక్కే వచ్చి పడిందే అంటున్నారా... మరేం పర్వాలేదు శెనగ, మైదా పిండికి బదులు మినప్పప్పుతో చేసుకుంటే సరిపోతుంది.
తిలోరి
కావాల్సినవి :
మినప్పప్పు : రెండు కప్పులు
నువ్వులు : మూడు కప్పులు
పచ్చిమిర్చి : పది
అల్లం : ఒక ముక్క
మిరియాలు : రెండు టీస్పూన్లు
ఉప్పు : సరిపడా
తయారీ : మినప్పప్పును శుభ్రంగా కడిగి మూడు గంటలు నానబెట్టాలి. నువ్వుల్ని కూడా కడిగి పక్కన పెట్టాలి. మిక్సీజార్‌లో మినప్పప్పు వేసి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పిండిని వెడల్పాటి గిన్నెలో వేసి చేత్తో బాగా కలపాలి. మిక్సీజార్‌లో పచ్చిమిర్చి, అల్లం, మిరియాలు వేసి గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని పిండిలో వేసి కలిపి, అందులోనే ఉప్పు, నువ్వులు వేసి బాగా కలపాలి. వాటిని ఒక వెడల్పాటి పళ్లెంలో వడియాల్లా పెట్టాలి. ఎండలో నాలుగు గంటలు ఉంచాలి. తినాలనుకున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ నూనెలో వేగించుకుంటే సరిపోతుంది.
దాల్ పాపడ్
కావాల్సినవి :
మినప్పప్పు : పావు కప్పు
పెసరపప్పు : పావు కప్పు
బియ్యప్పిండి : రెండు కప్పులు
జీలకర్ర : ముప్పావు టీస్పూన్
మిరియాల పొడి : అర టీస్పూన్, నువ్వులు : రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు, నూనె : సరిపడా, వేడి నూనె : రెండు టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి : మూడు, కొత్తిమీర : రెండు టేబుల్ స్పూన్లు
కసూరీ మేతీ : రెండు టీస్పూన్లు
నీళ్లు : అర కప్పు
కరివేపాకు : కొంచెం
తయారీ : మినప్పప్పు, పెసరపప్పును నీళ్లలో పావుగంట నానబెట్టాలి. తర్వాత మిక్సీజార్‌లో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. మరో గిన్నెలో బియ్యప్పిండి, జీలకర్ర, మిరియాలపొడి, నువ్వులు, ఉప్పు వేసి వేడి నూనె పోసి ఉండలు లేకుండా కలపాలి. అందులోనే మినప్పప్పు, పెసరపప్పు పిండి కూడా వేయాలి. దాంతోపాటు పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, కరివేపాకు, కసూరీ మేతీ వేయాలి. అందులో నీళ్లు పోసి ముద్దలా కలపాలి. తర్వాత దాన్ని చిన్న ఉండలు చేయాలి. ఒక్కో ఉండను చెక్కల్లా పలచగా వత్తాలి. వాటిని వేడి నూనెలో వేగించాలి.
మురుకులు
కావాల్సినవి :
మినప్పప్పు : ఒక కప్పు
నీళ్లు: రెండు కప్పులు
బియ్యప్పిండి: రెండు కప్పులు
నల్ల నువ్వులు: రెండు టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి: ఒక టీస్పూన్
వాము: అర టీస్పూన్, ఉప్పు: సరిపడా
వేడి నీళ్లు: రెండు టేబుల్ స్పూన్లు
తయారీ : మినప్పప్పును నీళ్లతో శుభ్రంగా కడగాలి. తర్వాత నీళ్లు పోసి ప్రెజర్ కుక్కర్లో ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. కుక్కర్లోంచి తీశాక మిక్సీజార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో బియ్యప్పిండి, వాము, ఉప్పు, మిరియాల పొడి, నల్ల నువ్వులు వేసి కలపాలి. వేడి నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. అందులో మినప్పప్పు మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. అవసరమైతే కొన్ని నీళ్లు చల్లుకుని పిండిని మెత్తటి ముద్దలా చేయాలి. మురుకులు వేసే మౌల్డ్‌లో నూనె పూసి అందులో పిండి కూరి, మురుకులు వత్తాలి. పిండి అంతా వత్తడం పూర్తయ్యాక వాటిని నూనెలో వేగించాలి. కరకరలాడే ఈ మురుకుల్ని అలాగే నమిలేయొచ్చు లేదా టీతో కలిపి తినొచ్చు.
మినప్పప్పు పూరి
కావాల్సినవి :
మినప్పప్పు : అర కప్పు
గోధుమ పిండి : అర కప్పు
బొంబాయి రవ్వ : పావు కప్పు
ఉప్పు,నీళ్లు : సరిపడా
కారం : అర టీస్పూన్
వాము : అర టీస్పూన్
నూనె : ఒక టేబుల్ స్పూన్
ఉల్లిగడ్డ : ఒకటి
కొత్తిమీర తరుగు : పావు కప్పు
అల్లం తురుము : ఒక టీస్పూన్
పచ్చిమిర్చి : రెండు
జీలకర్ర పొడి : అర టీస్పూన్
బియ్యప్పిండి : పావు కప్పు
తయారీ : గోధుమ పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, వాము, కారం, నూనె ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి ముద్దలా కలపాలి. కాసేపు పక్కన ఉంచాలి. మినప్పప్పుని శుభ్రంగా కడిగి మూడు గంటలు నానబెట్టాలి. తర్వాత మిక్సీజార్‌లో వేసి, కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పిండిని ఒక గిన్నెలో వేసి, బియ్యప్పిండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డ తరుగు, జీలకర్ర పొడి, ఉప్పు, అల్లం తురుము వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. రెడీ చేసుకున్న పిండి ముద్దను చపాతీలా వత్తి, స్క్వేర్ షేప్‌లో కట్ చేయాలి. ఒక్కో ముక్క మీద మినప్పప్పు మిశ్రమం పెట్టాలి. వాటిని నేరుగా నూనెలో వేగించాలి. అంతే... వెరైటీ క్రిస్పీ మినప్పప్పు పూరీ రెడీ.
బోండా
కావాల్సినవి :
మినప్పప్పు : అర కప్పు
నీళ్లు : పావు కప్పు
కరివేపాకు, కొత్తిమీర తరుగు : కొద్దిగా, పచ్చిమిర్చి : రెండు
అల్లం తురుము : ఒక టీస్పూన్
లేత కొబ్బరి తరుగు : ఒకటిన్నర టేబుల్ స్పూన్
ఉప్పు, నూనె : సరిపడా
తయారీ : గిన్నెలో మినప్పప్పుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నాలుగు గంటలు నానబెట్టాలి. తర్వాత నానిన మినప్పప్పును వడకట్టి, మిక్సీజార్‌లో వేయాలి. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ గ్రైండ్ చేయాలి. గిన్నెలోకి తీసిన మినప్పిండిని బాగా కలిపి అందులో కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, లేత కొబ్బరి తరుగు, అల్లం తురుము, ఉప్పు వేసి బాగా కలపాలి. నూనె వేడి చేసి రెడీ చేసుకున్న పిండి మిశ్రమాన్ని బోండాల్లా వేయాలి. బోండాలు బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి. మినప బోండాలను కొబ్బరి లేదా పల్లీ చట్నీ లేదా సాంబార్‌తో తింటే యమ్మీగా ఉంటాయి.