యురేనియం కోసం అడవి బలి!

యురేనియం కోసం అడవి బలి!

నాగర్​కర్నూల్​ జిల్లాలోని అమ్రాబాద్‌‌ టైగర్​ రిజర్వ్​ ఫారెస్ట్​లో మైనింగ్​ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏరియాలో యురేనియాన్ని వెలికితీయటానికి కేంద్ర అణుశక్తి సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇది ప్రస్తుతం పర్మిషన్లు కోరే దశలో ఉంది. అయితే, ఇక్కడ ఖనిజ తవ్వకాలకు కేంద్రం ఒకవేళ ఓకే అంటే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దేశంలో చాలా చోట్ల పెద్దపులులు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద పులుల అభయారణ్యాల్లో ఒకటైన అమ్రాబాద్​ అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరగబోతున్నాయనే ప్రచారం నిజమైతే పులుల మనుగడకు ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గనుల తవ్వకాల వల్ల యురేనియం తాలూకు దుమ్ము, ధూళి కారణంగా ఫారెస్ట్​ ఏరియా వెలుపల ఉన్నవాళ్ల ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. ఖనిజ అన్వేషణ ప్రతిపాదనకు తెలంగాణ వన్యప్రాణి మండలి, ఆ తర్వాత కేంద్ర సంస్థ కూడా మూడేళ్ల కిందటే ఓకే అన్నాయి. సర్వేకి అనుమతి ఇవ్వాలంటే పూర్తి వివరాలతో ఫారం–-సి సమర్పించాలనే సూచన వచ్చింది. దీనిపై అటవీ శాఖలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. అణుశక్తి సంస్థ.. సర్వే కోసమే పర్మిషన్​ అడుగుతోందంటూ ఫారెస్ట్​ ఆఫీసర్లు అప్పట్లో లైట్​ తీసుకున్నారు. యురేనియం తవ్వకాల వల్ల కలిగే ముప్పు తీవ్రతను ఊహించలేకపోయారు.

మూడు సంవత్సరాల కిందట రాష్ట్ర వన్యప్రాణి మండలిలో చర్చ జరిగినప్పుడే అబ్జెక్షన్​ చెబితే బాగుండేదనే అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది. అమ్రాబాద్​ అటవీ ప్రాంతం దేశంలోని అతి పెద్ద పులుల అభయారణ్యాల్లో ఒకటి. రాష్ట్ర విభజనకు ముందు దీన్ని నాగార్జునసాగర్ పులుల అభయారణ్య ప్రాంతంగా వ్యవహరించేవారు. తర్వాత అమ్రాబాద్ టైగర్​ రిజర్వ్​ ఫారెస్ట్​గా 2014లో ఏర్పాటైంది. ఇది 2,611.30 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ​ ఏరియాలో వన్య ప్రాణుల స్వేచ్ఛకు, అరుదైన వన మూలికలకు కొదవ లేదు. గతంలో ఓ సంస్థ కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఇక్కడ రీసెర్చ్​ చేసిన ప్రపంచంలోనే నాణ్యమైన యురేనియం ఉన్నట్లు గుర్తించింది. అయితే ఈ ‌‌ప్రాంతంలో యురేనియం తవ్వకాలను జరపరాదని అమ్రాబాద్‌‌ ‌‌రిజర్వ్​ డైరెక్టర్‌‌ ప్రభుత్వానికి ఇటీవల నివేదిక పంపారు.

ఈ ప్రాజెక్టులో 4 వేల బోర్లు తవ్వాలి. పెద్ద యంత్రాలు ఉపయోగించి బోర్లు తవ్వటప్పుడు వచ్చే సౌండ్​లకు జంతువులు చెల్లాచెదురవుతుందని అంటున్నారు. చెట్లు పడగొట్టబోమని అణు శక్తి శాఖ అంటున్నా మైనింగ్‌‌ ‌‌ప్రారంభిస్తే చెట్ల కూలగొట్టకుండా పనులు జరగవు. మైనింగ్‌‌ ‌‌చేసిన తర్వాత మట్టినీ, రాళ్లను వేరే ప్రాంతాలకు తరలించాలంటే సరైన రోడ్డు సౌకర్యాలు లేవు. అటవీ శాఖ అధికారులు వెల్లడించిన ఈ అభ్యంతరాలను కేంద్రం పట్టించుకోలేదు.

ఎప్పుడు మొదలైంది? 

నాగర్​కర్నూల్​​ జిల్లాలో నల్లమల అడవులు 2,611 చ.కి.మీ. విస్తరించి ఉన్నాయి. అయితే ఇందులో 9 కి.మీ. పరిధిలోనే ఖనిజాల కోసం తవ్వకాలు జరుపుతామని గతంలో రీసెర్చ్​ చేసిన సంస్థ తెలిపింది. ఈ విలువైన ఖనిజ సంపదతో దేశ ఆర్థిక రంగానికి ఎంతో లాభం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. విషయం బయటకు పొక్కటంతో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, గిరిజనులు, మేధావులు ఏకతాటిపైకి వచ్చి అప్పట్లో యురేనియం తవ్వకాలను తాత్కాలికంగా ఆపటంలో విజయం సాధించారు.

మైనింగ్​ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదు. 1995లో ‘యురేనియం కార్పొరేషన్ లిమిటెడ్ ఆఫ్ ఇండియా’ దేవరకొండ డివిజన్​లోని కృష్ణా పరివాహక ప్రాంతం (పెద్దగుట్ట) వద్ద దట్టమైన అటవీ ప్రాంతంలో అన్వేషణ చేసి 18 వేల టన్నుల ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. 2003 ఆగస్టు 8న నాటి నల్గొండ కలెక్టర్ సిసోడియా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా మైనింగ్​ను జనమంతా ఒక్క మాటగా వద్దన్నారు. దీంతో కేంద్రం పునరాలోచనలో పడింది. స్థానికులను ఎలాగైనా ఒప్పించటానికి 2005లో కొంత మందిని జార్ఖండ్​కి తీసుకెళ్లి అక్కడ జరుగుతున్న ఖనిజాల మైనింగ్​ పనులను చూపించారు. యురేనియం తవ్వకాల వల్ల ఎలాంటి నష్టాలూ జరగవంటూ సమాధానపరిచే ప్రయత్నం చేశారు. అయినా ప్రజలు ససేమిరా అన్నారు. జనంలో వస్తున్న తీవ్ర వ్యతిరేకతను గ్రహించిన కేంద్రం వెనక్కి తగ్గి మళ్లీ 2008లో ప్రయత్నాలు మొదలు పెట్టింది.

రోబోటిక్ యంత్రాన్ని యురేనియం నిక్షేపాల పరిశీలన కోసం ఉడిమిళ్ల ప్రాంతంలో ప్రవేశ పెట్టారనే వార్తలు సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తున్నాయి. ఆ మెషీన్​ తనకుతానుగా భూమి లోపలి భాగాలను ఫొటోలు తీసి పంపుతుందని, దీంతో మైనింగ్​ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదనే అభిప్రాయం స్థానికులను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. కేంద్రం ఈ అనుమతులను రద్దు చేయకపోతే న్యాయ పోరాటం చేస్తామని ప్రజా సంఘాలు పిలుపునిస్తున్నాయి. యురేనియం తవ్వకాల కోసం ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని, ఎన్​జీవోల ముసుగులో చాటుగా సర్వే చేస్తూ ఆందోళనకు గురిచేస్తోందని ఆరోపిస్తున్నాయి.

అందువల్ల ఈ ఏరియాలోని అన్ని వర్గాల అభిప్రాయాలను మరోసారి తెలుసుకోవాలని, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు.  – డాక్టర్​ పోలం సైదులు

మైనింగ్​తో నష్టాలు

ఈ అటవీ ప్రాంతాన్నే నమ్ముకొని బతుకుతున్న దాదాపు 120 గూడేల్లోని 11 వేల మంది కోయలను, చెంచులను మైదాన ప్రాంతాలకు తరలించాలి. భారీ యంత్రాలతో మైనింగ్​ చేస్తే గాల్లో చేరే వ్యర్థాలతో కృష్ణా, గోదావరి నదీ జలాలు కలుషితమవుతాయి. స్థానికులు అనారోగ్యం బారినపడతారు. ఉమామహేశ్వరం, సలేశ్వరం, లొద్ది మల్లయ్య, గోరాపురం భ్రమరాంభ మల్లిఖార్జునాలయం, మద్దిమడుగు ఆంజనేయ స్వామి ఆలయం, మల్లెల తీర్థం లాంటి పుణ్య క్షేత్రాలు; వన్య ప్రాణులు, మూలికా వనాలు కనుమరుగవుతాయి. కార్బన్‌ ‌వాయువులు అదిమి పట్టి ఉంచే ఈ అడవులను నరికి వేస్తే పర్యావరణ సమస్యలు వస్తాయని హెచ్చరించారు.   ఏపీ, తెలంగాణతోపాటు హైదరాబాద్​లో సగం జనాభాకు కృష్ణా జలాలే తాగు నీళ్లు. యురేనియం తవ్వకాలు, పరిశోధనలతో సాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులు పొల్యూట్​ అవుతాయి. ఈ అడవుల్లో పులులతోపాటు ఫాంథర్లు, ఎలుగు బంట్లు, ఇతర జంతు జాలం ఉందనీ, తవ్వకాలు ప్రారంభిస్తే వాహనాల రాకపోకలతో వన్య మృగాలు చెల్లాచెదురవుతాయనీ తమ నివేదికలో అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ అభ్యంతరాలనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా యూరేనియం తవ్వకాలకు సిఫారసు ‌చేయడం సరికాదు.

యురేనియంతో లాభాలేంటి?

సర్కారు చెబుతున్న మాటేంటంటే.. ఈ సహజ సంపదను సద్వినియోగం చేసుకుంటే వచ్చే పదేళ్లలో అణు విద్యుత్ సామర్థ్యాన్ని 7 వేల మెగా వాట్ల నుంచి 40 వేల మెగా వాట్లకు పెంచొచ్చు. ప్రతి పల్లెలో వెలుగులు నింపొచ్చు. దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఖనిజాల తవ్వకాలతో అనర్థాలు జరక్కుండా ఆఫీసర్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. స్థానికులకు జాబులు వస్తాయి. అడవిలోని వన్య ప్రాణుల మనుగడ దెబ్బ తినకుండా, పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా చూస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.