యురేనియం ఊబిలో నల్లమల అటవీప్రాంతం

యురేనియం ఊబిలో నల్లమల అటవీప్రాంతం

ప్రస్తుత సమాజంలో మానవ అభివృద్ధి పేరిట ముళ్ల కంచెలాంటి బాటలు భావితరాలకు దారులుగా చూపిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో సముద్ర మట్టానికి దాదాపు 1,000 మీటర్ల ఎత్తులో ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకునే ఒక పెట్టని కోటలా దక్కన్ పీఠభూమి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నల్లమల అటవీ ప్రాంతం ఎన్నో రకాల వన్య ప్రాణులకు, అటవీ ఉత్పత్తులకు నిలయం. వీటిమీద ఆధారపడి జీవిస్తున్న గిరిజనులకు ఒక ఆవాస ప్రాంతంగా ఉంటూ,  పర్యాటకులకు కనువిందు చేసే ఒక సుందర వనమై వికసిస్తోంది. కాగా, యురేనియం ఒక మానవ వినాశనకారి. నల్లమల్ల అటవీప్రాంతం మీద యూసీఐఎల్ అనే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ కన్నేసింది. యురేనియం వెలికితీత ముసుగులో ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్లు వారితోపాటు, అవినీతి అధికారులు చేతులు కలిపి స్వచ్ఛమైన కల్మషంలేని అడవి బిడ్డల బతుకుల్ని అంధకారంలోకి నెట్టివేసే కుట్ర జరుగుతున్నది. 

యురేనియం నుంచి న్యూక్లియర్​ ఎనర్జీ

1789లో పిచ్ బ్లెండ్ అనే ఒక ఖనిజం నుంచి యురేనియంను వెలికి తీయవచ్చు అనే విషయాన్ని కనుగొన్నారు. ఆ తరువాత 1896వ సంవత్సరంలో హేన్రీ బేక్వెరల్ అనే శాస్త్రవేత్త యురేనియం నుంచి వెలుపడే రేడియో ధార్మిక శక్తిని కనుగొన్నాడు. ఈ రేడియో ధార్మిక శక్తిలో ఆల్ఫా,  బీటా, గామా కిరణాలు ఉంటాయనే విషయం సమాజానికి తేటతెల్లమయింది. ఈ ఆల్ఫా, బీటా, గామా కిరణాల నుంచి అసాధారణమైన శక్తి విడుదలై వీటి ద్వారా న్యూక్లియర్ ఎనర్జీ ఉత్పన్నం అవుతుంది. న్యూక్లియర్ ఎనర్జీని అణుబాంబుల తయారీలో,  రాకెట్, శాటిలైట్ లాంచింగ్ వెహికల్​లో ఇంధనంగా వాడతారు. ఇవి శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఒక పురోగమన అభివృద్ధిగా భావించవచ్చు.  యురేనియం ద్వారా వెలుపడే ఆల్ఫా, బీటా, గామా కిరణాలు వైద్య , పారిశ్రామిక రంగాల అభివృద్ధికి దోహదపడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.  యురేనియంను న్యూక్లియర్ రియాక్టర్ చే మండించి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయవచ్చు. 1950వ దశకంలో అప్పటి ప్రధాని నెహ్రూ మన దేశంలో ఏడు యురేనియం బావులను, 22 న్యూక్లియర్ రియాక్టర్ల ఏర్పాటును ప్రతిపాదించగా.. 1967 సంవత్సరంలో జార్ఖండ్ రాష్ట్రంలోని జూదుగూడ అనే ప్రాంతంలో యురేనియం బావిని ప్రారంభించారు. ఈ బావి నుంచి వెలువడే వ్యర్ధాల మూలంగా అక్కడ నివసిస్తున్న ప్రజలు అనేక రకాల అనారోగ్య పరిస్థితులకు గురికావడం మనందరికీ తెలిసిందే.

జాదుగూడ యురేనియం బావి మూసివేత

జాదుగూడ యురేనియం బావి మూసివేతకు, అక్కడి ప్రజల ఆరోగ్య పరిస్థితులను కాపాడడం కోసం ఎన్నో ఎన్జీవో సంస్థలు సర్వే వివరాలను ప్రభుత్వాలకు విన్నవించడం జరిగింది. ఎన్జీవోస్ ఇచ్చిన నివేదికలో వాస్తవాలు తెలుసుకోవడం కోసం అప్పటి ప్రభుత్వం BARC శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసింది. ఎన్జీవోస్ ఇచ్చిన నివేదిక యురేనియం తవ్వకాలకు పూర్తిగా విరుద్ధంగా ఉందంటూ తమ రిపోర్టును ప్రభుత్వానికి కమిటీ అందజేసింది.  బార్క్ నివేదికను ఆధారంగా చేసుకుని జాదుగూడలో కొన్ని సంవత్సరాలు యురేనియం తవ్వకాలు యధావిధిగా కొనసాగాయి. 1998వ  సంవత్సరంలో వాజ్​పేయి  ప్రభుత్వం అక్కడ ప్రజలు చేస్తున్న పర్యావరణ పరిరక్షణ,  రైతు ఉద్యమాలకు తలొగ్గి జాదుగూడ యురేనియం బావిని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. 

యురేనియం వ్యర్థాలతో పెనుముప్పు

పచ్చని అడవితో ప్రకృతి రమణీయంగా పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేసే నల్లమల అడవి ప్రాంతంపై   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కన్ను పడడం జరిగింది.  నల్లమలలో యురేనియం నిల్వలు ఉన్నట్లు యూసీఐఎల్ గుర్తించింది. ఈ తవ్వకాల కోసం దాదాపు 5 సంవత్సరాల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రచిస్తున్నాయి.  కానీ, యురేనియం ద్వారా వెలువడే వ్యర్ధాలు కృష్ణా నదిలో కలిస్తే  వన్యప్రాణులు, అక్కడ నివసించే గిరిజన ప్రాంత ప్రజల మనుగడ  ప్రశ్నార్థకంగా మారుతుంది.  యురేనియం ద్వారా వెలుపడే రసాయనాలు గాలిలో కలవడం వల్ల గాలి విషతుల్యం అవుతుంది. దాని ప్రభావం దాదాపు 8 మైళ్ల దూరం వరకు వ్యాపిస్తుంది. అలా వ్యాపించిన విషతుల్యమైన గాలిని పీల్చుకోవడం వలన ఆ పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.  సమాజ వినాశనకారి అయిన యురేనియం వెలికితీత నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం.

-  రాగిపని బ్రహ్మచారి