
సిద్దిపేట, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీతో కుమ్మక్కై రాజకీయాలను భ్రష్టు పట్టించారని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తూ ఇమామ్ అన్నారు. గురువారం సిద్దిపేటలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్లుగా బీజేపీ డబ్బులు పంచడంతో ఎన్నికల్లో గెలిచిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ను ఓడించాలని బీజేపీ కుట్రలు చేస్తే దానికి బీఆర్ఎస్ వత్తాసు పలకడం శోచనీయమన్నారు.
కేటీఆర్ ఫార్ములా ఈ కారు రేస్ లో అరెస్టు కాకుండా బీజేపీ అడ్డుపడుతూ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో కవితను బయటపడేసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని దుయ్యబట్టారు. పదవుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు గ్యదారి మధు, సలీం, రాకేశ్, అనిల్, రాహుల్ పాల్గొన్నారు.