నిజామాబాద్ సిటీ, వెలుగు : ఫుట్ పాత్ ను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలని వెంటనే తొలగించాలని అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణపై అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, ట్రాఫిక్ ఏసీపీ నారాయణతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
నగరంలోని ఫుట్ పాత్ లపై నిర్మించిన అక్రమ కట్టడాలతో ట్రాఫిక్ నియంత్రణ కావడం లేదని, తక్షణమే వాటిని తొలగించాలని మున్సిపల్ కమిషనర్, ట్రాఫిక్ ఏసీపీని ఆదేశించారు. నగరంలో రోడ్లపై కూరగాయలు, తోపుడు బండ్ల వ్యాపారాలతో అత్యవసర సమయాల్లో అంబులెన్సు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. వీధి వ్యాపారాలు చేసుకునే వారిని తక్షణమే రైతు బజారులోకి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
నగరంలో పలుచోట్ల వ్యర్థాలను సరిగా తొలగించడం లేదని మార్కెట్ పరిసరాలలో చెత్త కుప్పలు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోందని, ప్రజలు అనారోగ్యాలబారిన పడాల్సి వస్తోందన్నారు. నగర అభివృద్ధికి నాయకులు, ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమీక్షలో ట్రాఫిక్ సీఐ వీరయ్య పాల్గొన్నారు.