టూరిస్టు స్పాట్ గా అర్బన్ పార్కులు

టూరిస్టు స్పాట్ గా అర్బన్ పార్కులు
  • ఓఆర్ఆర్ చుట్టూ స్పెషల్ అట్రాక్షన్ కు హెచ్ఎండీ చర్యలు
  • వీకెండ్ టూరిజంను డెవలప్ చేసేందుకు  ప్లాన్
  • 25 కోట్లతో8 పార్కుల్లో మరిన్ని బ్యూటిఫికేషన్ పనులు


హైదరాబాద్, వెలుగు :   సిటీ  చుట్టూ 158 కి.మీ విస్తరించి ఉన్న ఔటర్ రింగ్ రోడ్ కు అర్బన్ పార్కులు స్పెషల్ అట్రాక్షన్ గా మారనున్నాయి. ఈ అర్బన్ పార్కులను మరింత డెవలప్​చేసి సిటిజన్లకు వీకెండ్ టూరిస్టు స్పాట్లుగా మార్చేందుకు హెచ్ఎండీ చర్యలు చేపట్టనుంది. సిటీ శివార్లలో 16 అర్బన్ పార్కులను డెవలప్ చేయగా.. ఇందులో 8 పార్కుల్లో రూ. 25 కోట్లతో మరిన్ని  బ్యూటిఫికేషన్ పనులు మొదలుకానున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని కమ్మదానం, పల్లె గడ్డ, మన్యం కంచ, అంబర్ పేట్ కలాన్, బాచారంతో పాటు యాదాద్రిలోని బీబీనగర్, మేడ్చల్ జిల్లాల్లోని తుర్కపల్లి పార్కులను టూరిస్టు స్పాట్లుగా  మార్చనున్నారు. 
 

విజిటర్ల నుంచి మంచి రెస్పాన్స్

హెచ్ఎండీఏ పరిధిలోని 7 జిల్లాల్లో 16 అర్బన్ పార్కులు ఉన్నాయి. రంగారెడ్డి, యాదాద్రి, మేడ్చల్, మెదక్ అర్బన్ ఫారెస్టు బ్లాకులను హెచ్​ఎండీఏ అభివృద్ధి చేసింది. 14 వేల ఎకరాల్లో విస్తరించిన ఈ పార్కుల్లో మంచి సౌలతులే ఉన్నాయి. వాచ్ టవర్లు, ప్రహరీ నిర్మాణం,  గ్రీనరీ, ల్యాండ్ స్కేపులతో పాటు కేఫ్ టేరియాలను అట్రాక్టివ్ గా మారుస్తున్నారు. దీంతో పాటు ఓఆర్ఆర్ వెంట ఇంటర్ చేంజేస్ వద్ద లైటింగ్, ల్యాండ్ స్కేపింగ్ పనులు చేస్తున్నారు. ఓఆర్ఆర్ నుంచి కేవలం 25 నుంచి 40 కిలోమీటర్ల దూరంలోనే ఈ అర్బన్ పార్కులు ఉండటంతో విజిటర్ల నుంచి మంచి రెస్పాన్స్​వస్తోంది. రెండేళ్ల క్రితం మేడ్చల్ జిల్లాలో ప్రారంభించిన ఆక్సిజన్ పార్కుకు వీకెండ్ లో విజిటర్లు ఎక్కువ వస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.  ఇదే తరహాలో అర్బన్ ఫారెస్టు బ్లాకులను కూడా తీర్చిదిద్దడం వల్ల వీకెండ్​టూరిజాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. 
 

 ఫారెస్ట్ బ్లాకుల్లో మొక్కల పెంపకం


హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన అర్బన్ బ్లాకుల్లో రంగారెడ్డి జిల్లాల్లో 8 ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో 3, మెదక్ లో 2, మేడ్చల్ లో 1, సంగారెడ్డి లో 1  పార్కును అధికారులు అభివృద్ధి చేశారు. ఒక్కో పార్కు వంద ఎకరాలపైనే ఉండగా ఎకరాకు దాదాపు 200 వందల మొక్కలను పెంచుతున్నారు. మొత్తం 14, 700 ఎకరాల్లోని పార్కుల్లో 25 లక్షల మొక్కలను  పెంచుతుండగా.. రాబోయే రోజుల్లో ఇవి  గ్రీన్ స్పేస్ పార్కులుగా మారనున్నాయి. ఓఆర్ఆర్ పై వెళ్లే వెహికల్స్ సంఖ్య ఏటా 25 శాతం పెరుగుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో ఓఆర్ఆర్ ను ఆనుకునే ఉన్న అర్బన్ ఫారెస్టు బ్లాకులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దితే వీకెండ్ లో సిటిజన్లతో పాటు శివారు జిల్లా వాసుల  నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు.   ఫ్యామిలీతో వీకెండ్ లో గడిపేలా అన్ని సౌలతులతో ఈ పార్కులను అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు రూపొందిస్తున్నామన్నారు.