
- రాష్ట్రవ్యాప్తంగా గత 13 ఏండ్లలో25 లక్షల ఎకరాలునాన్ అగ్రికల్చర్‌గా మార్పు
- రోజురోజుకూ తగ్గుతున్న వ్యవసాయ భూములు
- మొన్నటిదాకా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకే పరిమితం
- ఇప్పుడు రూరల్ జిల్లాల్లోనూ పెరిగిన వెంచర్లు
- సాగు భూములు తగ్గితే లాభాల కన్నా నష్టాలే ఎక్కువ
- భూ వినియోగ పాలసీ లేకపోవడంతో ఇష్టారీతిన భూముల వినియోగం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వ్యవసాయ భూములు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. పచ్చని పంట పొలాలు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు రాష్ట్రవ్యాప్తంగా గత 13 ఏండ్ల కాలంలో దాదాపు 25 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు నాన్ -అగ్రికల్చర్ ల్యాండ్స్ గా మారాయి. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో వ్యవసాయ భూములు ఎక్కువగా నాన్ అగ్రికల్చర్‌కు మారినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇతర పట్టణాల చుట్టూ ఉన్న గ్రామాలు మున్సిపాలిటీల్లో కలిసిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడంతో, వ్యవసాయ భూములపై రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, నివాస సముదాయాలు, పారిశ్రామిక యూనిట్లు వెలుస్తున్నాయి. ఈ పరిణామం ఒకవైపు ఆర్థిక వృద్ధిని, మౌలిక సదుపాయాల అభివృద్ధిని తెచ్చిపెడుతున్నప్పటికీ మరోవైపు వ్యవసాయ రంగం, గ్రామీణ జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో భూ వినియోగ పాలసీని తక్షణ అవసరంగా తీసుకురావాలని సూచిస్తున్నారు.
వేగంగా పట్టణీకరణ..
రాష్ట్రంలో అర్బన్ ఏరియా ప్రాంతం వేగంగా పెరుగుతోంది. పట్టణాలకు ఆనుకొని ఉన్న గ్రామాలు పట్టణాల్లో కలిసిపోతున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో ఉన్న వ్యవసాయ భూములు భవన నిర్మాణాలకు, ఇతర కమర్షియల్ పర్పస్ కు మారుతున్నాయి. ఎంతో కొంత విస్తీర్ణం మిగిలి ఉంటున్నప్పటికీ పట్టణంలో కలిసిపోవడం, ఆ ప్రాంతంలో వ్యవసాయం చేసే వెసులుబాటు లేకపోవడం, రియల్ వెంచర్ వేస్తే అధిక ధర వస్తుండటంతో రైతులు సాగు భూములు అమ్ముకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతాలు కూడా కాంక్రీట్ జంగల్‌గా దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా.. రోడ్డుకు ఇరువైపులా పదుల ఎకరాల్లో వెంచర్లు దర్శనమిస్తున్నాయి. హైవేల పక్కన అయితే లెక్కనే లేదు. ఏ ప్రాంతానికి వెళ్లినా వ్యవసాయ భూమి ఎకరాకు రూ.20 లక్షల పైనే ధర పలుకుతున్నది.
ఇక ప్రధాన ప్రాంతాలు, రోడ్లు ఉన్నట్లయితే ఆ భూముల ధరలు ఎకరాకు కోట్ల రూపాయలు పలుకుతున్నాయి. ఏరియాను బట్టి ఎకరం కోటి, రూ.2 కోట్లు, రూ.3 కోట్లు, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి ప్రాంతాల్లో అయితే రూ.10 కోట్లు, 20 కోట్లు ఆ పైన ధరలు కూడా ఉంటున్నాయి.
గుంటల చొప్పున అమ్ముతూ..
ఎకరాల్లో కొనుగోలు చేస్తున్న రియల్ వ్యాపారులు వాటిని విక్రయించేటప్పుడు మాత్రం గుంటలుగా మార్చి అమ్ముతున్నారు. ఒక ఎకరం భూమినే 10 నుంచి 15 మందికి విక్రయిస్తున్నారు. కొంటున్నవాళ్లు కూడా వాళ్ల అవసరాల మేర తీసుకుంటున్నారు. ధరణిలో గుంటల్లో రిజిస్ట్రేషన్ చేస్తూ.. ఫీల్డ్‌కు వచ్చేసరికి వాటిని గజాల్లో కొలిచి హద్దులు ఇస్తున్నారు. రికార్డుల్లో అవి ఇంకా వ్యవసాయ భూములుగానే ఉండటంతో నాలా కన్వర్షన్ ఫీజులు కూడా తప్పించుకుంటున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఉన్న ఆయా వ్యవసాయ భూముల్లో శ్రీగంధం, రెడ్ శాండల్ మొక్కలు పెడతాం.. వాటితోనూ కొంతకాలానికి ఆదాయం వస్తుందంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిజినెస్ చేస్తున్నారు.
కొంత లాభం.. ఎక్కువ నష్టం
నాన్ అగ్రికల్చర్ భూములు పెరుగుతుండటంతో కొంత లాభం.. ఎక్కువ నష్టం అన్నట్టుగా మారింది. ప్రధానంగా పంట ఉత్పత్తులు, రైతుల జీవనోపాధిపై ప్రభావం పడుతున్నది. వ్యవసాయ భూమి తగ్గితే ఆహార ధాన్యాలు, కూరగాయలు, ఇతర పంటల ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. ఇక రైతులు తమ జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడాల్సి వస్తోంది. వ్యవసాయ భూముల స్థానంలో కాంక్రీట్ నిర్మాణాలు పెరగడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోవడం, కాలుష్యం పెరిగి పచ్చదనం తగ్గుదల వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.
ఎకరం, రెండు ఎకరాలలోపు మాత్రమే భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులు పూర్తిగా తమ భూములను కోల్పోతున్నారు. అయితే, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, సేవా రంగంలో కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. గ్రామీణ జనాభాకు పట్టణ సౌలభ్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. మెరుగైన రవాణా, వైద్యం, విద్యా సౌకర్యాలతో జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి.
భూ వినియోగంపై కొరవడిన ప్రణాళిక
రాష్ట్రంలో భూమి వినియోగంపై ఒక స్పష్టమైన విధానం లేదు. దీంతో పరిశ్రమలకు, భవన నిర్మాణాలకు, ఇతర అవసరాలకు మారుతున్న వ్యవసాయ భూములపై నియంత్రణ లేకుండా పోయింది. ఇలా పంటలు పండే భూములన్నీ నాన్ అగ్రికల్చర్‌కు మారితే భవిష్యత్తులో వరి, పత్తి, కందిలాంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులు పడిపోయి.. కొరత ఏర్పడే ప్రమాదం ఉందని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఒక గ్రామంలో ఎంత భూమిని వ్యవసాయేతర అవసరాలకు వాడాలనే దానిపై పాలసీ తీసుకురావాలని నిపుణులు కోరుతున్నారు.
అదే సమయంలో వ్యవసాయ భూములను కాపాడేందుకు, పట్టణ విస్తరణను సమతుల్యంగా నిర్వహించేందుకు కొన్ని కీలక చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. వ్యవసాయ భూములను ఇతర ప్రయోజనాల కోసం మార్చడంపై కఠిన నిబంధనలు విధించాలని కోరుతున్నారు. ‘‘జోనింగ్ విధానాల ద్వారా వ్యవసాయ, పట్టణ భూములను స్పష్టంగా వేరు చేయాలి. పట్టణ విస్తరణ ప్రణాళికాబద్ధంగా జరిగేలా, వ్యవసాయ భూములను కాపాడేలా ప్రాజెక్టులను రూపొందించాలి.
గ్రీన్ బెల్ట్‌లను, పర్యావరణ స్నేహపూర్వక నిర్మాణాలను ప్రోత్సహించాలి. రైతులకు ఆధునిక వ్యవసాయ టెక్నాలజీలు, మార్కెటింగ్, ఆర్థిక సహాయం అందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను స్థాపించాలి. తద్వారా రైతులు తమ భూమిని వదులుకోకుండానే అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది’’ అని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ జిల్లాల్లోనే ఎక్కువ..
రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో అత్యధికంగా వ్యవసాయ భూములు నాన్ అగ్రికల్చర్‌కు మారగా.. ఇప్పుడు ఇదే కోవలోకి రూరల్‌లో ఉండే జిల్లాలు కూడా వచ్చి చేరాయి. రంగారెడ్డి జిల్లాల్లో ఒకప్పుడు 6 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా.. ఇప్పుడు అది 3.50 లక్షల ఎకరాలకు పడిపోయింది. దాదాపు రెండున్నర లక్షల ఎకరాల అగ్రికల్చర్ భూమి నాలాకు కన్వర్ట్ అయింది.
ధరణి వచ్చిన తరువాత యాదాద్రి భువనగిరి జిల్లాలో 32 వేల ఎకరాలు, నల్లగొండలో 26 వేలు, మేడ్చల్ లో 21 వేలు, మహబూబ్‌నగర్‌లో 12 వేలు, సూర్యాపేటలో 16 వేలు, హనుమకొండలో 11 వేలు, నిజామాబాద్‌లో 14 వేల ఎకరాల మేర భూములు నాన్ అగ్రికల్చర్‌కు మారినట్లు తెలుస్తున్నది.