పట్టణీకరణ అనేది అభివృద్ధి ప్రక్రియలో భాగం. వెనుకబడిన సమాజంలో పట్టణీకరణ నెమ్మదిగా ఉంటుంది. ఈ కారణంగా గ్రామాల నుంచి పట్టణాలకు వలస వచ్చే వారికి ఉపాధిని అందించలేదు. గ్రామాల్లో ఆర్థిక, సాంఘిక ఒత్తిళ్లు గ్రామాల నుంచి కొంత మంది వ్యక్తులను బయటకు నెట్టివేసినా పట్టణాలు వారిని ఆకర్షించలేవు. అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలో పట్టణాలు ఉపాధిని కల్పించడంతో గ్రామాల నుంచి వలస వచ్చేవారిని ఆకర్షిస్తాయి. దేశ జనాభాలో పట్టణ జనాభా శాతం అధికంగా ఉన్నప్పుడు కూడా పట్టణీకరణ ప్రక్రియ నెమ్మదిస్తుంది.
పట్టణ వృద్ధి, పట్టణీకరణకు తేడా ఉంది. పట్టణ వృద్ధి అంటే పట్టణం లేదా నగరంలో నికర జనాభా పెరుగుదలను తెలుపుతుంది. పట్టణీకరణ అంటే దేశం మొత్తం జనాభాలో పట్టణ జనాభా అనుపాతం పెరుగుదలను తెలుపుతుంది. ఉదాహరణకు సహజ కారణాల వల్ల పట్టణాల్లో జనాభా పెరిగితే అది పట్టణ జనాభా వృద్ధి తెలుపుతుంది. గ్రామాల్లో కూడా జనాభా అదే రేటుతో పెరిగితే పట్టణీకరణ పెరగదు. మరో రకంగా చెప్పాలంటే గ్రామీణ జనాభా పెరుగుదల రేటు కంటే పట్టణ జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉన్నప్పుడు పట్టణీకరణ సంభవిస్తుంది.
మన దేశంలో 1911 నుంచి గ్రామీణ జనాభా పెరుగుదల రేటు కంటే పట్టణ జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా నమోదవుతోంది. అందుకే మన దేశంలో 100 సంవత్సరాల నుంచి పట్టణీకరణ సంభవిస్తోంది. 1901లో పట్టణ జనాభా శాతం 11. 1951 నాటికి 17.3 శాతానికి, 2011 నాటికి 31.2 శాతానికి పెరిగింది. భారత్‌లో పట్టణ జనాభా శాతం పెరుగుతున్నా అభివృద్ధి చెందిన దేశాలతో (ఆస్ట్రేలియాలో 91 శాతం, ఇంగ్లండ్‌లో 89 శాతం) పోలిస్తే తక్కువగానే ఉంది.
పట్టణీకరణ ధోరణులు చర్చించేటప్పుడు 1901–1951, 1961–2011 అని రెండు కాలాలుగా విడదీస్తారు. 1961లో పట్టణ ఆవాసాల నిర్వచనాన్ని సవరించారు. 1901 నుంచి 1951 మధ్య పట్టణీకరణ 10.9 నుంచి 17.3 శాతానికి పెరిగింది. ప్రణాళిక ప్రక్రియ ప్రారంభం నాటికి ప్రతి ఆరుగురిలో ఒకరు పట్టణాల్లో నివసిస్తున్నారు. 1901–11 మధ్య పట్టణాల్లో కంటే గ్రామాల్లో జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉంది. 1921 నుంచి పట్టణాల్లో జనాభా రేటు ఎక్కువగా నమోదైంది. ఫలితంగా పట్టణీకరణ పెరుగుతూ వచ్చింది. 1941–51 మధ్య పట్టణ, గ్రామీణ జనాభా వృద్ధి వ్యత్యాసం 32.4గా నమోదైంది. 1961లో 18 శాతంగా ఉన్న పట్టణీకరణ 2011 నాటికి 31.2 శాతానికి పెరిగింది. అంటే ప్రస్తుతం ముగ్గురిలో ఒకరి కంటే తక్కువగా పట్టణాల్లో నివసిస్తున్నారు.
2011లో గ్రామీణ, పట్టణ జనాభా నిష్పత్తి 68.8: 31.2. 2001–11 మధ్య పట్టణ జనాభా వృద్ధి 31.8 శాతం కాగా, గ్రామీణ జనాభా వృద్ధి 12.2 శాతం. 1971–81ల మధ్య పట్టణ జనాభా వృద్ధి (46.8 శాతం) అధికంగా నమోదైంది. పట్టణ గ్రామీణ జనాభా వృద్ధి వ్యత్యాసం 1981లో అధికంగా 29.6 శాతం నమోదు కాగా, 2011 నాటికి 19.6 శాతానికి తగ్గింది. భారత్‌లో పట్టణ జనాభా శాతం పెరుగుతున్నా, పట్టణ జనాభా పెరుగుదల రేటు 1981 తర్వాత తగ్గుతోంది. పట్టణ, గ్రామీణ జనాభా నిష్పత్తి తగ్గుతూ వస్తోంది. 2001లో 5,161గా ఉన్న పట్టణాలు 2011 నాటికి 7935కి చేరాయి. గత పది దశాబ్దాల్లో 2541 పట్టణాలు పెరగగా, ఈ ఒక్క దశాబ్దంలో 2,774 పట్టణాలు పెరిగాయి. దీనికి ప్రధాన కారణం సెన్సెస్ పట్టణాలు పెరగడమే. 2011లో 90 శాతం పట్టణాలు పెరుగుదలకు కారణం సెన్సెస్ పట్టణాలు పెరగడమే.
మొత్తం జనాభాలో పట్టణాల్లో నివసించే జనాభా శాతాన్ని పట్టణీకరణ అంటారు. 2011 లెక్కల ప్రకారం ఏడు ప్రాంతాలలో మాత్రమే గ్రామాల కంటే పట్టణాల్లో ఎక్కువ జనాభాను కలిగి ఉన్నాయి. అవి.. ఢిల్లీ, చంఢీగఢ్, లక్షదీవులు, డామన్ డయ్యూ, పాండిచ్చేరి, రాష్ట్రాల్లో గోవా, మిజోరాం.
అధిక పట్టణీకరణ నమోదు రేటు
2011 జనాభా లెక్కల్లో కేరళ పట్టణీకరణ 26 నుంచి 47.7 శాతానికి పెరిగింది. ఏ రాష్ట్రంతో పోల్చినా ఇది అత్యధిక పెరుగుదల. అంటే అదనంగా 21.7 పాయింట్లు పెరిగింది. రెండో అత్యధిక పట్టణ వృద్ధి సిక్కిం, మూడో అత్యధిక పట్ఠణాభివృద్ధి గోవాలో నమోదైంది.
పట్టణీకరణ సవాళ్లు
పట్టణీకరణ ప్రక్రియ పెద్ద నగరాలు, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఉన్న నగరాల్లో వృద్ధి ఎక్కువగా ఉంది. అధిక పరపతి రేటింగ్‌ను పొందడంతో బాండ్లు ద్వారా ఇతర పరపతి సాధనాలు ద్వారా వనరులు సమీకరించుకోగలుగుతున్నాయి. చిన్న పట్టణాల్లో సరైన అవస్థాపనా సదుపాయాలు లేక అభివృద్ధి ప్రాజెక్టులకు వనరులు సమకూర్చుకోవడం కష్టమవుతోంది. అందుకే పెట్టుబడులు కూడా ఈ ప్రాంతాలకు సరిగా లభించలేదు.
2011లో పెరిగిన పట్టణాల్లో 90 శాతం సెన్సెస్ పట్టణాల వల్ల పెరిగాయి. అంటే గ్రామాల జనాభా పెరిగి వ్యవసాయేతర కార్యకలాపాల్లో పనిచేసేవారు పెరగడం వల్ల గ్రామాలు సెన్సెస్ పట్టణాలుగా మారుతున్నాయి. అయితే, ఇక్కడ పట్టణ సదుపాయాలు, పట్టణ పరిపాలనా విస్తరించలేదు.