Urbanization : పట్టణాలెందుకు పెరగాలి..? : ఇండియన్ ఎకానమీ గ్రూప్స్ ప్రత్యేకం

Urbanization : పట్టణాలెందుకు పెరగాలి..? : ఇండియన్ ఎకానమీ గ్రూప్స్ ప్రత్యేకం

అభివృద్ధి ప్రక్రియలో పట్టణీకరణ భాగం. వెనుకబడిన సమాజంలో పట్టణీకరణ నెమ్మదిగా ఉండటంతో గ్రామాల నుంచి పట్టణాలకు వలస వచ్చే వారికి ఉపాధిని అందించలేదు. గ్రామాల్లోని ఆర్థిక, సాంఘిక ఒత్తిళ్లు గ్రామాల నుంచి కొంత మంది వ్యక్తులను బయటకు నెట్టివేసినా పట్టణాలు వారిని ఆకర్షించలేవు. అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలో పట్టణాలు ఉపాధిని కల్పించడంతో గ్రామాల నుంచి వలస వచ్చే వారిని ఆకర్షిస్తాయి. దేశ జనాభాలో పట్టణ జనాభా శాతం  అధికంగా ఉన్నప్పుడు పట్టణీకరణ ప్రక్రియ నెమ్మదిస్తుంది.

స్టాట్యుటరీ టౌన్స్​:  మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, కంటోన్మెంట్​ బోర్డులు లేదా నోటిఫై చేయబడిన పట్టణాలను స్టాట్యుటరీ పట్టణాలు అంటారు. 

సెన్సస్​ టౌన్స్​: 1971 జనాభా లెక్కల నుంచి పట్టణాలను నిర్వచించారు. 1. కనీస జనాభా 5000 ఉండాలి. 2. పనిచేసే పురుషుల్లో 75శాతం మంది వ్యవసాయేతర రంగాల్లో పనిచేయాలి. 3. చదరపు కిలో మీటరుకు 400 మంది నివసించాలనే లక్షణాలు కలిగిన వాటిని సెన్సస్​ టౌన్స్​ అంటారు. 

అర్బన్ అగోలోమెరేషన్స్​(పట్టణ పరిధి) :  ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పట్టణాలు నిరంతరాయంగా విస్తరిస్తూ శివారు ప్రాంతాలను తమలో చేర్చుకుంటూ విస్తరించే పట్టణాలు. 1951 జనాభా లెక్కల్లో పక్కపక్కనే ఉన్న పట్టణాలను టౌన్​ గ్రూప్​గా పేర్కొన్నారు. 1971 జనాభా లెక్కల్లో అర్బన్​ అగోలోమెరేషన్స్​ అనే భావనను పరిచయం చేశారు. 

అవుట్​ గ్రోత్​:  ప్రధాన నగరం చుట్టూ రైల్వేకాలనీ, యూనివర్సిటీ క్యాంపస్​, పోర్ట్​ ఏరియా తదితర రూపాల్లో ప్రాంతాలు ఏర్పడుతూ ఉండే వాటిని అవుట్​ గ్రోత్​గా పిలుస్తారు. సాధారణంగా ఇవి పట్టణ పరిధి బయట ఉంటాయి. 
2011లో పట్టణాల సంఖ్య 7935. ఇందులో స్టాట్యుటరీ టౌన్స్​ 4041, సెన్సస్​ టౌన్స్​ 3894, ఇందులో అర్బన్​ అగోలోమెరేషన్స్​ 475, అవుట్​ గ్రోత్​ 981 ఉన్నాయి. 
భారత్​లో పట్టణాలను జనాభాను అనుసరించి ఆరు రకాలుగా విడదీస్తారు. అవి.. 1. 5000 లోపు జనాభా ఉంటే ఆరో తరగతి పట్టణం, 2.5000–10,000 మధ్య జనాభా – ఐదో తరగతి పట్టణం 3. 10,000 నుంచి 20,000 జనాభా – నాలుగో తరగతి పట్టణం 4. 20,000–50,000 – మూడో తరగతి పట్టణం 5. 50,000– లక్ష జనాభా – రెండో తరగతి పట్టణం 6. లక్షపై జనాభా – ఒకటో తరగతి పట్టణం. 

మొదటి తరగతి పట్టణాలను నగరాలు అంటారు. రెండు, మూడో తరగతి పట్టణాలను మధ్యతరగతి పట్టణాలని, 4, 5, 6వ తరగతి పట్టణాలను చిన్న తరహా పట్టణాలని పిలుస్తారు. పట్టణాల్లో జనాభా పెరగడం వల్ల, వలసలు వల్ల రెండో తరగతి పట్టణాలు నగరాలుగా మారుతున్నాయి. 2011లో మొదటి తరగతి పట్టణాలు 468, మొత్తం పట్టణాల్లో  వీటి శాతం 6. కానీ మొత్తం పట్టణ జనాభాలో 70శాతం జనాభా మొదటి తరగతి పట్టణాల్లోనే ఉంది. 

2011లో పట్టణ జనాభా 37.7కోట్లు. 2011లో గ్రామాల్లో అదనంగా పెరిగిన జనాభా (9.05కోట్లు) కంటే పట్టణాల్లో అదనంగా పెరిగిన జనాభా (9.10కోట్లు) కొంచెం ఎక్కువగా ఉంది. స్వాతంత్ర్యం తర్వాత పట్టణాల్లో అదనంగా పెరిగిన జనాభా ఎక్కువ ఉండడం ఇదే మొదటిసారి. దీనికి మూడు కారణాలు చెప్పవచ్చు. 1. పట్టణాల్లో సహజంగా పెరిగే జనాభా 2. గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు 3. గ్రామాల నుంచి పట్టణాల వరకు గల ఆవాసాలను పునర్​వర్గీకరించడం. 

పట్టణ జనాభాలో 50.8 మిలియన్లతో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో 44 మిలియన్లతో ఉత్తరప్రదేశ్​ రెండో స్థానంలో 34.9 మిలియన్లతో తమిళనాడు మూడో స్థానంలో ఉన్నాయి. తక్కువ పట్టణ జనాభా గల రాష్ట్రాలు సిక్కిం, అరుణాచల్​ప్రదేశ్, మిజోరాం. అధిక పట్టణ జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ, తక్కువ పట్టణ జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం లక్షదీవులు. 2011లో పట్టణ జనాభా 37.71కోట్లు, పట్టణ లింగ నిష్పత్తి 936, పట్టణ అక్షరాస్యత 84.98శాతం. 

పట్టణీకరణ 

పట్టణవృద్ధి, పట్టణీకరణకు తేడా ఉంది. పట్టణ వృద్ధి అంటే పట్టణం లేదా నగరంలో నికర జనాభా పెరుగుదలను తెలియజేస్తుంది. పట్టణీకరణ అంటే దేశం మొత్తం జనాభాలో పట్టణ జనాభా అనుపాతం పెరుగుదలను తెలుపుతుంది. ఉదాహరణకు సహజ కారణాల వల్ల పట్టణాల్లో జనాభా పెరిగితే అది పట్టణ జనాభా వృద్ధిని తెలుపుతుంది. గ్రామాల్లో కూడా జనాభా అదే రేటులో పెరిగితే పట్టణీకరణ పెరగదు. మరొక రకంగా చెప్పాలంటే గ్రామీణ జనాభా పెరుగుదల రేటు కంటే పట్టణ జనాభా వృద్ధిరేటు ఎక్కువగా ఉన్నప్పుడు పట్టణీకరణ సంభవిస్తుంది. 

భారతదేశంలో 1911 నుంచి గ్రామీణ జనాభా పెరుగుదల రేటు కంటే పట్టణ జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా నమోదవుతోంది. అందుకే మనదేశంలో 100 సంవత్సరాల నుంచి పట్టణీకరణ సంభవిస్తుంది. 1901లో పట్టణ జనాభా శాతం 11 కాగా, 1951 నాటికి 17.3శాతానికి 2011 నాటికి 31.2శాతానికి పెరిగింది. భారత్​లో పట్టణ జనాభా శాతం పెరుగుతున్నా అభివృద్ధి చెందిన దేశాలతో (ఆస్ట్రేలియాలో 91శాతం, ఇంగ్లాండ్​లో 89శాతం) పోలిస్తే తక్కువగానే ఉంది. 

పట్టణీకరణ ధోరణులు చర్చించేటప్పుడు 1901–1951, 1961–2011 అని రెండు కాలాలుగా విడదీస్తారు. 1901 నుంచి 1951 మధ్య పట్టణీకరణ 10.9 నుంచి 17.3శాతానికి పెరిగింది. ప్రణాళిక ప్రక్రియ ప్రారంభం నాటికి ప్రతి ఆరుగురిలో ఒకరు పట్టణాల్లో నివసిస్తున్నారు. 1901–11 మధ్య పట్టణాల్లో కంటే గ్రామాల్లో జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉంది. 1921 నుంచి పట్టణాల్లో జనాభా రేటు ఎక్కువగా నమోదైంది. ఫలితంగా పట్టణీకరణ పెరుగుతూ వచ్చింది. 1941–51 మధ్య పట్టణ, గ్రామీణ జనాభా వృద్ధి వ్యత్యాసం 32.4 శాతం  నమోదైంది. 1961లో 18శాతంగా ఉన్న పట్ణణీకరణ 2011 నాటికి 31.2శాతానికి పెరిగింది. అంటే నేడు ప్రతి ముగ్గురిలో ఒకరి కంటే తక్కువగా పట్టణాల్లో నివసిస్తున్నారు. 2011లో గ్రామీణ పట్టణ జనాభా నిష్పత్తి 68.8: 31.2.

మెగా నగరాలు : యూఎన్​ఓ నిర్వచనం ప్రకారం కోటి జనాభా దాటితే అది మెగా నగరం. దీని ప్రకారం మనదేశంలో మూడు మెగా నగరాలున్నాయి. అవి.. గ్రేటర్​ ముంబయి (18.44 మిలియన్లు), ఢిల్లీ (16.31 మిలియన్లు), కలకత్తా (14.1 మిలియన్లు). 2001తో పోలిస్తే 2011లో ఈ మూడు మెగా నగరాల్లోనూ జనాభా వృద్ధిరేటు నెమ్మదించింది. 
ఈ మూడు మెగా నగరాల్లో నివసించే జనాభా 48.8మిలియన్లు. ఇది మొత్తం పట్టణ జనాభాలో 13శాతం. 

మెట్రో, మెగా నగరాలు : 1901లో కలకత్తా ఒక్కటే మెట్రో నగరం ఉండేది. 1971 నాటికి 9కి, 2001 నాటికి 35కు పెరిగాయి. 2011 నాటికి 53కు చేరాయి. పట్టణ జనాభాలో 43శాతం ఇక్కడే నివసిస్తున్నారు. 2001 జనాభా లెక్కల్లో మెగాసిటీలు ఆరు ఉండేవి. అవి.. గ్రేటర్​ ముంబయి, ఢిల్లీ, కలకత్తా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్​. 2011 నాటికి 9కి పెరిగాయి. అదనంగా అహ్మదాబాద్​, వడోదర, పుణె చేరాయి. మిలియన్​ ఫ్లస్​ సిటీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్​ (7), కేరళ (7). ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఏడేసి నగరాలు ఉన్నాయి. 

పట్టణ జనాభా 

ప్రాంతం    2001    2011    పెరుగుదల    వృద్ధి
గ్రామీణ    74.26    83.35    9.05కోట్లు    12.3శాతం
పట్టణ    28.61    37.7    9.10కోట్లు    31.8శాతం

సం.    జనాభా    పట్టణ జనాభా    పట్టణ జనాభా    పట్టణ, గ్రామీణ    పట్టణాల సంఖ్య
            పెరుగుదల రేటు    జనాభా నిష్పత్తి
1901    89    11    -    1:8.1    1827
1951    82.7    17.3    43.2    -    -
2001    72.2    27.8    31.2    1:2.6    5161
2011    68.86    31.14    31.8    1:2.2    7935