- మెదక్ జిల్లాలో రైతుల బారులు
- అదును చూసుకుని ఎక్కువకు అమ్ముతున్న వ్యాపారులు
నర్సాపూర్, వెలుగు : మెదక్ జిల్లాలో యూరియా కొరత ఏర్పడింది. నర్సాపూర్, హత్నూర మండలాలతో పాటు కౌడిపల్లిలో రైతులు యూరియా కోసం కష్టాలు పడాల్సి వస్తున్నది. మంగళవారం నర్సాపూర్ పీఏసీఎస్ కేంద్రానికి యూరియా లోడ్ వచ్చిందని తెలుసుకున్న రైతులు భారీ సంఖ్యలో బారులు తీరారు. హత్నూర మండలం దౌల్తాబాద్ లో ఓ ఫర్టిలైజర్ షాప్ కు యూరియా రావడంతో అక్కడ కూడా ఇదే సీన్ కనిపించింది. ఆఫీసర్ల అలసత్వం వల్లే టైంకు యూరియా రావడం లేదని, కొరతను నివారించకపోతే ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.
కౌడిపల్లిలో బస్తాపై అదనపు దోపిడీ
కౌడిపల్లి : కౌడిపల్లిలో ఐదు రోజులుగా యూరియా దొరక్కపోవడంతో మంగళవారం ఉదయం నుంచి రైతులు యూరియా గోదాముల వద్ద పడిగాపులు కాశారు. ఒక లోడు యూరియా బస్తాలు రాగానే బారులు తీరారు. అయితే, బస్తాకు 266 రూపాయలు అమ్మాల్సి ఉండగా, ఇదే అదునుగా భావించిన ఫర్టిలైజర్ యజమానులు రూ.300 చొప్పున అమ్ముతున్నారు. దీనికి తోడు యూరియా బస్తా ఇవ్వాలంటే గంట గుళికలతో పాటు ఇతర మందులు కొనాలని ఒత్తిడి చేస్తున్నారు. సుమారు రూ.520కి బస్తా అమ్ముతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
టెంపరరీ బిల్లులు తయారు చేసి వాటి పైనే బిల్లు వేస్తున్నారని, అసలైన చీటీపై వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌడిపల్లి వ్యవసాయ ఏడీఏ పుణ్యవతిని వివరణ కోరగా ఈ విషయంలో తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని, రూ.266 కంటే ఎక్కువ అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు. ఒరిజినల్ కొటేషన్ ఉన్న బిల్ స్లిప్పులు మాత్రమే ఇవ్వాలని, లేదంటే సీజ్ చేస్తామని తెలిపారు.