దేవ్గఢ్: ఝార్ఖండ్ దేవ్గఢ్ జిల్లాలోని త్రికూట పర్వతాల్లో రోప్ వే కేబుల్ కార్లలో చిక్కుకుపోయిన టూరిస్టులందరినీ భారత వాయుసేన కాపాడింది. 45 గంటల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ లో 47 మంది పర్యాటకులను ఎయిర్ ఫోర్స్ సిబ్బంది రక్షించారు. కేబుల్ కార్ల నుంచి సేఫ్ గా బయటపడిన వారు ఈ ఘటన గురించి, తాము పడిన ఇబ్బందుల గురించి చెప్పారు. ఒకవేళ సైనికులు డ్రోన్ల ద్వారా తమకు నీళ్లు అందించకపోతే.. మూత్రం తాగడానికి సిద్ధపడ్డామన్నారు. ‘మేం కేబుల్ కార్లలో చిక్కుకుని ఉన్నాం. ఇంకాస్త సమయం మాకు నీళ్లు అందకపోతే, బాటిళ్లలో పట్టిన మూత్రం తాగడానికి రెడీ అయ్యాం. కానీ జవాన్లు మాకు సమయానికి నీళ్లు, ఆహారం అందించారు’ అని వినయ్ కుమార్ దాస్ అనే బాధితుడు అన్నాడు. అయితే, ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో 12 మందికి తీవ్ర గాయాలవ్వడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కేబుల్ కార్లలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెండు హెలికాప్టర్లు, డజన్ల కొద్దీ సైనికులు శ్రమించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో పాటు ఆర్మీ, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ లో కలసి పని చేశాయని దేవ్ గఢ్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ భజంత్రీ అన్నారు.
కేబుల్ కార్లలో చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం, నీళ్లను అందించారు. ఇదిలా ఉంటే.. ప్రమాదం తర్వాత సోమవారం సహాయక చర్యల్లో భయానక ఘటన చోటుచేసుకుంది. వైమానిక దళ సిబ్బంది ఓ వ్యక్తిని కాపాడే క్రమంలో హెలికాప్టర్ నుంచి కిందపడి చనిపోయాడు. మంగళవారం కూడా రెస్క్యూ ఆపరేషన్ సందర్భంగా మరో మహిళ కిందపడి ప్రాణాలు కోల్పోయింది. పట్టుతప్పి కింద పడటంతో తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని హాస్పిటల్కు తరలించారు. ట్రీట్మెంట్ కొనసాగుతుండగానే ఆమె మృత్యువాత పడింది. చనిపోయిన మహిళను 60 ఏళ్ల శోభాదేవిగా గుర్తించారు.
ఇకపోతే, ఎయిర్ ఫోర్స్ కు చెందిన రెండు ఎంఐ–17 హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. కేబుల్ కార్లలో చిక్కుకుపోయిన ఒక వ్యక్తిని కాపాడేందుకు రక్షణ బలగాలు ప్రయత్నించాయి. అయితే గాల్లో ఉన్న హెలికాప్టర్ వద్దకు తాడు సాయంతో చేరుకోగలిగిన ఆ వ్యక్తి.. కాక్ పిట్ వద్దే వేలాడుతూ కనిపించాడు. అయితే అతడ్ని హెలికాప్టర్ లోపలకు లాక్కునేందుకు సైన్యం చేసిన యత్నాలు ఫలించలేదు. కాసేపటికే పట్టుతప్పి కిందపడిపోయి.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు వెస్ట్ బెంగాల్ కు చెందిన వాడిగా గుర్తించారు. మొత్తంగా ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
మరిన్ని వార్తల కోసం: