హైదరాబాద్‎కు రెండు భారీ డేటా సెంటర్లు: రూ.10 వేల కోట్లకు దావోస్‎లో డీల్

హైదరాబాద్‎కు రెండు భారీ డేటా సెంటర్లు: రూ.10 వేల కోట్లకు దావోస్‎లో డీల్

హైదరాబాద్: దావోస్ వేదికగా జరుగుతోన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇన్వెస్ట్‎మెంట్ చేసేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో రెండు ప్రముఖ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఉర్సా క్లస్టర్స్, బ్లాక్ స్టోన్ సంస్థలు తెలంగాణలో ఇన్వెస్ట్‎మెంట్ చేసేందుకు అంగీకరించాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఇరు కంపెనీల ప్రతినిధులు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకున్నారు. 

ఉర్సా క్లస్టర్స్ దాదాపు రూ. 5000 కోట్లు

అమెరికాకు చెందిన ఉర్సా క్లస్టర్స్ దాదాపు రూ. 5000 కోట్లతో తెలంగాణలో అత్యాధునిక అర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్‌ను స్థాపించనుంది. దీనికి సంబంధించి దావోస్‎లో రాష్ట్ర ప్రభుత్వంతో ఈ సంస్థ అవగాహన ఒప్పందం చేసుకుంది. కంపెనీ సీవోవో సతీష్ అబ్బూరి, సీఆర్వో ఎరిక్ వార్నర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. హైదరాబాద్‎లో 100 మెగావాట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని కంపెనీ సీఈవో పెందుర్తి అన్నారు. ఇందులో హైబ్రిడ్ ఏఐ చిప్‌లను ఉపయోగిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టుపై దాదాపు రూ.5000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఉర్సాతో భాగస్వామ్యం పంచుకోవటంతో అత్యాధునిక సాంకేతికత రంగంలో రాష్ట్రం మరో ముందడుగు వేస్తుందని అన్నారు.

బ్లాక్ స్టోన్ రూ.4,500 కోట్ల పెట్టుబడులు


పెట్టుబడులు, మౌలిక సదుపాయాలలో ప్రపంచ అగ్రగామి సంస్థ బ్లాక్‌స్టోన్ హైదరాబాద్లో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు దావోస్‎లో తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. రూ.4500 కోట్లతో రాష్ట్రంలో 150 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. బ్లాక్‌స్టోన్ లూమినా (బ్లాక్‌స్టోన్ యొక్క డేటా సెంటర్ విభాగం)తో పాటు జేసీకే ఇన్‌ఫ్రా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతిపాదిత డేటా సెంటర్ రూ.4,500 కోట్ల వరకు పెట్టుబడి పెడుతుంది.

ALSO READ | లక్షా 32 వేల కోట్ల పెట్టుబడులు.. 46 వేల ఉద్యోగాలు : దావోస్ లో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు

 ఇంధన సామర్థ్యం, అధునాతన శీతలీకరణ వ్యవస్థలు, సైబర్ భద్రతా ప్రోటోకాల్‌ అవసరాలకు సంబంధించి ఏఐ ఆధారిత సేవలను ఈ డేటా సెంటర్ అందిస్తుంది. బ్లాక్‌స్టోన్ లుమినా ప్రపంచంలోని ప్రముఖ క్లౌడ్ మౌలిక సదుపాయాల ప్రొవైడర్లలో కీలకంగా ఉంది. ఈ కంపెనీ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవటంతో మిగతా విదేశీ కంపెనీలు సైతం తెలంగాణ వైపు చూస్తున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలకు తెలంగాణ గమ్యస్థానంగా మారనుంది.