- జాన్‌పహాడ్ దర్గా వద్ద కనిపించని కనీస వసతులు
- కోట్ల ఇన్‌కం వస్తున్నా సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోని ఆఫీసర్లు
- అక్రమార్కుల చేతుల్లోనే దర్గా భూములు
- ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న జాన్‌పహాడ్ ఉర్సు
నేరేడుచర్ల (పాలకవీడు), వెలుగు : రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్‌పహాడ్ దర్గా వద్ద సౌలత్‌లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దర్గాకు ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల ఇన్‌కం వస్తున్నా సౌకర్యాలు కల్పించడంలో ఇటు ప్రభుత్వం, అటు వక్ఫ్ బోర్డు ఆఫీసర్లు విఫలం అవుతున్నారు. దీంతో ఉర్సు టైంలో వచ్చే లక్షలాది మంది భక్తులు రోడ్ల వెంట ఉంటూ, చెట్ల కింద వంటలు చేసుకుంటున్నారు. ఈ నెల 26 నుంచి జాన్‌పహాడ్ ఉర్సు ప్రారంభం కానుంది. ఉత్సవాల్లో భాగంగా 27న నిర్వహించే గంధం ఊరేగింపునకు ఏపీ, తెలంగాణ నుంచి సుమారు 2 లక్షల మంది హాజరయ్యే చాన్స్ ఉంది. అయినా అక్కడ సౌకర్యాల కల్పనకు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రతి ఏటా ఉర్సు టైంలో వసతులు కల్పిస్తామని హామీలు ఇస్తున్న ప్రజాప్రతినిధులు, ఆ తర్వాత మర్చిపోతున్నారు. దీంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.
అపరిశుభ్రంగా దర్గా పరిసరాలు
జాన్‌పహాడ్ దర్గాను దర్శించుకునే భక్తులు తప్పనిసరిగా సఫాయి బావి వద్ద స్నానాలు చేయడం సంప్రదాయం. కానీ ఈ బావి పూర్తిగా మురికిగా మారడంతో స్నానాలు చేసేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ శాశ్వత మంచినీటి సదుపాయం లేకపోవడంతో కందూరు చేసి మొక్కులు తీర్చుకునే భక్తులు ప్రైవేట్ వాటర్ ప్లాంట్ల నుంచి నీటిని కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. అలాగే శానిటేషన్ సిబ్బంది లేకపోవడంతో దర్గా పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. దీంతో ఉర్సుకు వచ్చిన వారు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇక్కడ షాపుల నిర్వహణతో ప్రతి ఏటా దర్గాకు సుమారు రూ. 1.20 కోట్ల ఇన్‌కం వస్తుంది. అయినా ఇక్కడ శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టేందుకు వక్ఫ్ బోర్డు ఆఫీసర్లు ప్రయత్నించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
దర్గా భూమి కబ్జా
దర్గా అభివృద్ధి, భవిష్యత్ అవసరాల కోసం ప్రభుత్వం గతంలో 14 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో ఐదు ఎకరాల్లోపు స్థలం మాత్రమే ప్రస్తుతం వక్ఫ్ బోర్డు చేతిలో ఉంది. మిగతా భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించి రూమ్‌లు నిర్మించుకున్నారు. వాటిని భక్తులకే అద్దెకు ఇస్తూ ఆదాయం పొందుతున్నారు. కబ్జాలపై రెవెన్యూ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కబ్జాకు గురైన స్థలాలను గతేడాది నల్గొండకు చెందిన ఆఫీసర్లు పరిశీలించినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా స్పందించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకొని దర్గా భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కేటీఆర్ హామీపైనే ఆశలు
మంత్రి కేటీఆర్ ఈ నెల 6న హుజూర్‌నగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా జాన్‌పహాడ్ దర్గా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మంత్రిని కోరారు. దీంతో ప్రపోజల్స్ పంపిస్తే జాన్‌పహాడ్ దర్గాను రంగారెడ్డి జిల్లాలోని జహంగీర్ పీర్ దర్గా మాదిరిగా అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి హామీ ఎప్పుడు నెరవేరుతుందోనని స్థానికులు ఎదురుచూస్తున్నారు.
ప్రపోజల్స్ పంపించాం దర్గా వద్ద శాశ్వత సౌకర్యాల కోసం
గతంలోనే ప్రపోజల్స్ పంపించాం. ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం. ప్రస్తుతం ఉర్సు నిర్వహణకు రూ.18.50 లక్షలు అవసరం అవుతాయని ప్రపోజల్స్ పెట్టాం. భూముల సర్వే చేపట్టి ఆక్రమణకు గురైన వాటిని స్వాధీనం చేసుకుంటాం.
– షేక్ మహ్మద్, ఉమ్మడి నల్గొండ జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్‌పెక్టర్