- వందలాది మంది సొంత దేశాలకు తరలింపు
- ఇమిగ్రేషన్ రూల్స్ కఠినంగా అమలు చేస్తున్న ట్రంప్ సర్కార్
- భయంతో పార్ట్ టైమ్ జాబ్స్ మానేస్తున్న ఇండియన్ స్టూడెంట్లు
వాషింగ్టన్: అక్రమ వలసదారులను అమెరికా అరెస్టు చేస్తున్నది. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా దేశంలో ఉంటున్నోళ్లను వెతికి పట్టుకుని తిరిగి వెనక్కి పంపుతోంది. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన వెంటనే అక్రమ వలసదారుల కట్టడికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేశారు. దీంతో యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ రంగంలోకి దిగింది. దేశంలోని అక్రమ వలసదారులను వెనక్కి పంపించేందుకు ఆపరేషన్ చేపట్టింది. ఇప్పటికే 500 మందికి పైగా అరెస్టు చేయడంతో పాటు వందలాది మందిని దేశం నుంచి పంపించివేసింది. ఈ వివరాలను వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ మీడియాకు వెల్లడించారు. ‘‘538 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశాం. వీరిలో అనుమానిత టెర్రరిస్టులు, గ్యాంగ్స్టర్లు, మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడిన నేరస్తులు ఉన్నారు. వందలాది మంది అక్రమ వలసదారులను మిలటరీ విమానంలో వెనక్కి పంపించాం. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని ట్రంప్ నెరవేరుస్తున్నారు” అని ఆమె తెలిపారు.
జాబ్ మానేస్తున్న స్టూడెంట్లు..
ఇమిగ్రేషన్ రూల్స్ ను అమెరికా కఠినంగా అమలు చేస్తుండడంతో అక్కడ ఉంటున్న ఇండియన్ స్టూడెంట్లు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులకు పట్టుబడితే స్టూడెంట్ వీసా రద్దుచేసి తిప్పి పంపిస్తారనే భయంతో పార్ట్ టైమ్ జాబ్స్ మానేస్తున్నారు. ఎఫ్1 వీసాపై అమెరికాలో చదువుకుంటున్న విదేశీ స్టూడెంట్లు.. తాము చదివే క్యాంపస్ లోనే వారానికి 20 గంటలు పనిచేసేందుకు అనుమతి ఉంటుంది. అయితే, కొంతమందికి మాత్రమే ఈ అవకాశం దొరుకుతుంది. మిగతా వారిలో పలువురు స్టూడెంట్లు ఖర్చుల కోసం క్యాంపస్ బయట రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లు, సూపర్ మార్కెట్లలో పనిచేస్తుంటారు. కొత్త అధ్యక్షుడు ట్రంప్ ఇమిగ్రేషన్ రూల్స్ ను కఠినంగా అమలుచేస్తామని ప్రకటించడంతో అందరూ పార్ట్ టైమ్ జాబ్స్ మానేస్తున్నారు.
‘‘నేను నెలవారీ ఖర్చుల కోసం కాలేజీ అయిపోయిన తర్వాత రోజుకు 6 గంటలు చిన్న కెఫెలో పనిచేసేవాడిని. గంటకు 7 డాలర్లు ఇచ్చేవారు. అయితే ఇమిగ్రేషన్ అధికారులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టి, అనధికారికంగా పని చేస్తున్నోళ్లను గుర్తిస్తున్నారని తెలిసి పోయిన వారమే జాబ్ మానేశా. దాదాపు 50 లక్షలు లోన్ తీసుకుని అమెరికాకు చదువుకోవడానికి వచ్చాను. ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని ముందు జాగ్రత్త పడుతున్నా” అని ఇల్లినాయీకి చెందిన స్టూడెంట్ ఒకరు చెప్పారు. వర్క్ ప్లేసులలో తనిఖీలు చేపడుతున్నారని తెలిసి తాను, తన ఫ్రెండ్స్ జాబ్ మానేశామని న్యూయార్క్‌కు చెందిన మరో స్టూడెంట్ తెలిపారు. ఖర్చుల కోసం ఫ్రెండ్స్ పై ఆధారపడుతున్నామని, తప్పనిసరి పరిస్థితుల్లో ఇండియాలోని తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బు అడుగుతున్నామని చెప్పారు.
డిజిటల్ డాలర్ పై నిషేధం..
సెంట్రల్ బ్యాంక్ తీసుకురావాలని అనుకున్న డిజిటల్ డాలర్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిషేధం విధించారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ఆయన గురువారం సంతకం చేశారు. బైడెన్ సర్కార్ హయాంలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) తీసుకురావాలని నిర్ణయించారు. అయితే అది అమెరికాకు ప్రమాదమని ట్రంప్ పేర్కొన్నారు. డిజిటల్ డాలర్ సృష్టి, జారీ, వినియోగంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
థర్డ్ జెండర్‌కు నో పాస్‌పోర్ట్
అమెరికాలో మహిళలు, పురుషులకే తప్ప మూడో జెండర్‌కు గుర్తింపు కల్పించబోమని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాస్ పోర్ట్ జారీలో మేల్, ఫిమేల్లను మాత్రమే అధికారులు గుర్తిస్తున్నారు. థర్డ్ జెండర్‌ను సూచించేలా ‘ఎక్స్’ (ఆంగ్ల అక్షరం X) గా పేర్కొన్న దరఖాస్తులను పక్కన పెడుతున్నారు. బైడెన్ సర్కారు హయాంలో 2022 నుంచి థర్డ్ జెండర్‌ను ‘ఎక్స్’ గా గుర్తిస్తూ పాస్ పోర్టులు జారీ చేశారు. ఇలాంటి పాస్ పోర్టులను అధికారులు రెన్యూవల్ చేయట్లేదు. కొత్తగా ఎక్స్ గుర్తింపుతో పాస్ పోర్టులు జారీ చేయడం, పాత వాటి రెన్యూవల్, పాస్ పోర్ట్‌లలో జెండర్ మార్పులకు వీలులేదని స్పష్టం చేస్తున్నారు.