
దుబాయ్/వాషింగ్టన్: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న రాస్ ఇసా ఆయిల్ పోర్టుపై అమెరికా వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 74 మంది చనిపోగా.. మరో 171 మంది గాయపడినట్లు హౌతీ రెబల్స్ శుక్రవారం వెల్లడించారు. ట్రంప్ ఆదేశాల మేరకు మార్చి 15 నుంచి తమపై జరుగుతున్న దాడుల్లో ఇప్పటివరకు ఇదే అత్యంత ఘోరమైన అటాక్ అని తెలిపారు. ఈ దాడి కారణంగా రాస్ ఇసా ఆయిల్ పోర్టు వద్ద పెద్దఎత్తున మంటలు చెలరేగాయన్నారు.
గాయపడిన వారిని రక్షించడంతోపాటు భారీగా ఎగిసి పడుతున్న మంటలను ఆర్పేందుకు సివిల్ డిఫెన్స్ టీమ్స్, యెమెన్ రెడ్ క్రెసెంట్ మెంబర్స్ రంగంలోకి దిగినట్లు వివరించారు. అమెరికా జరిపిన ఈ దాడి యెమెన్ సార్వభౌమత్వానికి విరుద్ధమన్నారు. ఈ పోర్టు యెమెన్‌లో 70% దిగుమతులు, 80% మానవతా సహాయం అందించే కీలక మార్గమని చెప్పారు. దీనిని లక్ష్యంగా చేసుకోవడం యుద్ధ నేరమన్నారు.
ట్రంప్ పాలనలో హౌతీలపై 200కు పైగా దాడుల్లో జరిగాయని.. ఇప్పటివరకు 120 మందికి పైగా మరణించారని యెమెన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇరాన్ విదేశాంగ శాఖ కూడా ఈ అటాక్‌ను అమానవీయ దాడిగా పేర్కొంది. దీనిపై యూఎస్ మిలటరీ సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఈ దాడులు ఇరాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు, హౌతీల ఆర్థిక వనరులను దెబ్బతీసేందుకు మాత్రమేనని తెలిపింది. రాస్ ఇసా పోర్టును హౌతీలు ఇంధన సరఫరా, అక్రమ ఆదాయ మార్గంగా ఉపయోగిస్తున్నారని ఆరోపించింది. ఈ ఆరోపణలపై యూఎస్ మిలటరీ సెంట్రల్ కమాండ్ స్పందించలేదు.
హౌతీలకు చైనా సాయం చేస్తున్నది: అమెరికా
చైనాకు చెందిన చాంగ్ గ్వాంగ్ శాటిలైట్ టెక్నాలజీ సంస్థపై అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. ఎర్ర సముద్రంలో అమెరికా యుద్ధనౌకలు, అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేసేందుకు చాంగ్ గ్వాంగ్ శాటిలైట్ టెక్నాలజీ సంస్థ సహకరిస్తున్నదని తెలిపింది. ఈ సంస్థకు చైనా సైన్యంతో సంబంధాలు ఉన్నాయని.. అమెరికా యుద్ధనౌకలను సంబంధించిన శాటిలైట్ ఫొటోలను హౌతీలకు ఇస్తున్నదని వెల్లడించింది.
ఆ ఫొటోల సాయంతో హౌతీలు ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులకు పాల్పడుతున్నారని వివరించింది. చైనా తనను తాను ప్రపంచ శాంతి దూతగా చెప్పుకుంటుందని..కానీ రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్ వంటి దేశాలకు ఆర్థిక, సాంకేతిక మద్దతును అందిస్తున్నదని మండిపడింది. చాంగ్ గ్వాంగ్ శాటిలైట్ టెక్నాలజీ సంస్థపై గతంలోనే ఫిర్యాదు చేసిన చైనా ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పింది. ఈ ఆరోపణలపై చైనా ఎంబసీగానీ, చాంగ్ గ్వాంగ్ సంస్థగానీ స్పందించలేదు.
రష్యాకు వెపన్స్ మేం ఇవ్వట్లే: చైనా
బీజింగ్: రష్యాకు చైనా ఆయుధాలు సరఫరా చేస్తోందన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపణలను చైనా విదేశాంగ శాఖ శుక్రవారం తోసిపుచ్చింది. అవి పూర్తిగా నిరాధారమని ఖండించింది. రష్యాతో సన్నిహితంగా ఉంటున్నప్పటికీ.. యుద్ధంలో తాము తటస్థంగా ఉన్నామని తరచూ చెప్పుకొస్తోంది. రష్యాకు చైనా గన్ పౌడర్ సరఫరా చేస్తోందని, రష్యన్ భూభాగంలో ఆయుధాలను కూడా ఉత్పత్తి చేస్తోందన్న జెలెన్ స్కీ ఆరోపణలను తాజాగా తోసిపుచ్చింది. ఉక్రెయిన్ సంక్షోభంలో ఏ పక్షానికీ చైనా ఎన్నడూ ఆయుధాలను సరఫరా చేయలేదని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది.