రెండో బ్యాచ్​లో 119 మంది వెనక్కి..అమృత్​సర్ లో ల్యాండ్ అయిన అమెరికా ఆర్మీ ఫ్లైట్

రెండో బ్యాచ్​లో 119 మంది వెనక్కి..అమృత్​సర్ లో ల్యాండ్ అయిన అమెరికా ఆర్మీ ఫ్లైట్
  • అమృత్​సర్ లో ల్యాండ్ అయిన అమెరికా ఆర్మీ ఫ్లైట్​
  • మోదీ ప్రభుత్వ దౌత్యవిధానానికి ఇదో పరీక్ష అన్న చిదంబరం
  • ఆ ఫ్లైట్లను అమృత్​సర్​లోనే ఎందుకు దించుతున్నరు: పంజాబ్​ సీఎం మాన్​
  • ఇది పంజాబ్ ​ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర అని విమర్శలు

న్యూఢిల్లీ:భారతీయ అక్రమ వలసదారులతో కూడిన అమెరికాలో రెండో విమానం శనివారం రాత్రి 10 గంటలకు పంజాబ్​లోని అమృత్​సర్​లో ల్యాండ్ అయింది. ఇందులో 119 మంది వెనక్కి తీసుకొచ్చారు. ఇల్లీగల్​ ఇమ్మిగ్రెంట్లకు సంబంధించిన మూడో విమానం కూడా ఆదివారం ఇండియాకు వస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ తరహా డిపోర్టేషన్​పై దేశంలోని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. సంకెళ్లు వేసి.. అమెరికా ఆర్మీ విమానాల్లో అమానకరంగా తీసుకొచ్చేందుకు కేంద్రం ఎలా అంగీకరించిందంటూ తప్పుపడుతున్నాయి.

అక్రమ వలసదారులను తిరిగి తీసుకురావడానికి ఈ రోజు అమృత్‌సర్‌లో దిగే అమెరికా ఆర్మీ విమానంపై అందరి దృష్టి ఉంది. బహిష్కరించబడిన వారి చేతులకు సంకెళ్లు వేసి, వారి కాళ్లను తాళ్లతో కట్టేస్తారా?” అని కాంగ్రెస్​ సీనియర్​ నేత చిదంబరం శనివారం ఎక్స్​లో ప్రశ్నించారు. “ఇది భారత దౌత్యానికి పరీక్ష” అని తన పోస్ట్​లో పేర్కొన్నారు.

ఇక్కడే దించడం వెనక బీజేపీ కుట్ర: భగవంత్ మాన్​

పంజాబ్‌ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడానికే అమెరికా డిపోర్టేషన్‌ విమానాలు అమృత్‌సర్‌‌లో దింపేందుకు పర్మిషన్ ఇచ్చారని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ఆరోపించారు. అమృత్‌సర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పంజాబ్‌పై వివక్ష చూపుతున్నదని.. రాష్ట్రాన్ని కించపరిచే కుట్రలో భాగంగా ఇలా చేస్తున్నారన్నారు.

అయితే పంజాబ్ సీఎం మాన్ కామెంట్లపై బీజేపీ ఫైర్ అయింది. ఇటువంటి సున్నితమైన విషయాలపై రాజకీయాలు చేయొద్దని స్పష్టం చేసింది. ‘‘అమెరికా నుంచి వస్తున్న డిపో ర్టేషన్ విమానాలకు అమృత్​సర్ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉంటుంది. అందుకే డిపోర్టేషన్ ఫ్లైట్స్ అక్కడ ల్యాండ్ చేసేందుకు పర్మిషన్ ఇచ్చాం’’ అని బీజేపీ జాతీయ ప్రతినిధి ఆర్పీ సింగ్ ఎక్స్​లో పోస్ట్‌ చేశారు.