హైదరాబాద్​లో ఆర్ఎక్స్ బెనిఫిట్స్ సెంటర్

హైదరాబాద్​లో ఆర్ఎక్స్ బెనిఫిట్స్ సెంటర్
  • మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ ప్రతినిధుల భేటీ

హైదరాబాద్, వెలుగు: అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్ఎక్స్ బెనిఫిట్స్ అనే సంస్థ దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్​లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(జీసీసీ)ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు బుధవారం సంస్థ ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబుతో సెక్రటేరియెట్​లో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ఆర్ఎక్స్ బెనిఫిట్స్ జీసీసీ ద్వారా 300 మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతిభావంతులకు మంచి అవకాశాలు వస్తాయని చెప్పారు. ఈ సంస్థ తన క్లయింట్లుగా ఉండే ఫార్మసీలు లాభాలు పెంచుకునేందుకు తోడ్పడుతుందన్నారు. హైదరాబాద్​ స్కిల్ సెంటర్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రొడక్ట్ ఇంజనీరింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రంలో సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత అపారంగా ఉందని, అందుకే ఎంఎన్​సీలకు రాష్ట్రం డెస్టినేషన్​గా మారిందని పేర్కొన్నారు. వ్యాపార విస్తరణకు అనుకూల వాతావరణం ఉండటం, మౌలిక సదుపాయాల పరంగా ఎటువంటి సమస్యలు లేకపోవడంతో ఆర్ఎక్స్ బెనిఫిట్స్ సంస్థ హైదరాబాద్​ను ఎంపిక చేసుకుందని వివరించారు. ఆధునిక సాంకేతిక, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వివిధ రంగాల్లో డిజిటల్ పరివర్తన అనివార్యంగా మారిందని చెప్పారు.