ఫస్ట్ క్లాస్ టికెట్ కంటే ఎక్కువ.. గంటకు 24 లక్షల ఖర్చు.. ఆర్మీ విమానాల్లోనే ఎందుకు..?

ఫస్ట్ క్లాస్ టికెట్ కంటే ఎక్కువ.. గంటకు 24 లక్షల ఖర్చు.. ఆర్మీ విమానాల్లోనే ఎందుకు..?

అమెరికా గతంలో అక్రమ వలసదారులను తరలించేందుకు యూఎస్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ICE) ఆపరేట్ చేసే రెగ్యులర్ ప్యాసింజర్ ఫ్లైట్స్ను వినియోగించేంది. కానీ ఈసారి మిలటరీ విమానాలను(C-17s, రెండు C-130Es ఆర్మీ విమానాలు) వినియోగించింది. ఈ ఆర్మీ విమానాల్లో వలసదారులను తరలించడం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం.

రాయిటర్స్ కథనం ప్రకారం.. 10 గంటల మిలటరీ ఆపరేషన్లో భాగంగా గ్వాటెమాలాకు ఒక్కో వలసదారుడిని తరలించడానికి 4,675 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో 4.07 లక్షలు) ఖర్చయింది. ఇదే రూట్లో నడిచే అమెరికన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ వన్ వే ఫస్ట్ క్లాస్ టికెట్ ధర(853 డాలర్లు) కంటే ఈ ఖర్చు ఐదు రెట్లు ఎక్కువ. ఈ లెక్కన భారత్ కు అక్రమ వలసదారులను తరలించడానికి 12 గంటల కంటే ఎక్కువ సమయమే పట్టింది.

అమెరికా మిలటరీ విమానం సీ-17లో అక్రమ వలసదారులుగా దొరికిపోయిన భారతీయులను తరలించడానికి గంటకు 28500 డాలర్ల ఖర్చయింది. మన కరెన్సీలో అక్షరాలా 24 లక్షలు. ఈ ప్రకారం.. 12 గంటలకు పైగానే ప్రయాణం జరిగిందంటే.. అక్రమ వలసదారులను తరలించడానికి అమెరికాకు ఎంత ఖర్చయి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇంత ఖర్చు పెట్టి మరీ యుద్ధ విమానాల్లో అక్రమ వలసదారులను తరలించాల్సిన అవసరం ఏంటని యూఎస్ డిఫెన్స్ అధికారులను అడగ్గా.. వీలైనంత త్వరగా అక్రమ వలసదారులను పంపించేయాలని అధ్యక్షుడు ట్రంప్ నుంచి ఆదేశాలు అందాయని, ఖర్చు గురించి ఆలోచించే పరిస్థితి లేదని చెప్పారు.

అమెరికా నుంచి అక్రమ వలసదారులతో కూడిన ఫస్ట్ బ్యాచ్‌‌ విమానం భారత్ చేరిన సంగతి తెలిసిందే. టెక్సాస్ నుంచి వచ్చిన సీ-17 మిలటరీ ప్లేన్ పంజాబ్లోని అమృత్‌‌సర్‌‌లో ఉన్న శ్రీ గురు రామ్‌‌దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బుధవారం మధ్యాహ్నం 1.55 గంటలకు ల్యాండ్ అయింది. అందులోని 104 మందిలో పంజాబ్‌‌కు చెందినవారు 30 మంది, హర్యానా, గుజరాత్‌‌కు చెందినవారు 33 మంది చొప్పున ఉన్నారు. ఉత్తర్‌‌ప్రదేశ్‌‌, మహారాష్ట్ర నుంచి ముగ్గురు చొప్పున, ఇద్దరు చండీగఢ్‌‌కు చెందినవారు ఉన్నట్లు అధికార వర్గాలు వివరించాయి. త్వరలో మరింత మంది అక్రమ వలసదారులను భారత్కు చేర్చే అవకాశం ఉందని తెలిపాయి. 

అక్రమ వలసదారులతో కూడిన ప్లేన్ భారత్ చేరిన నేపథ్యంలో ఎయిర్ పోర్టు బయట భారీ బారికేడింగ్ తో పాటు పెద్ద సంఖ్యలో  పోలీసు సిబ్బందిని మోహరించారు. 104 మందిని తనిఖీలు చేసిన తర్వాత వారిని ఇండ్లకు పంపే ఏర్పాట్లు చేశారు. వారిలో ఎవరికైనా క్రిమినల్ రికార్డ్ ఉంటే అక్కడే అదుపులోకి తీసుకునేందుకు కూడా చర్యలు చేపట్టారు.

అక్రమ వలసదారులతో కూడిన యుఎస్ సైనిక విమానం భారత్ చేరడంపై పంజాబ్ మంత్రి కుల్దీప్ సింగ్ ధలివాల్ స్పందించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడిన వ్యక్తులను ట్రంప్ బహిష్కరించడం కరెక్ట్ కాదన్నారు. వారికి అమెరికాలోనే శాశ్వత నివాసం కల్పించాల్సిందన్నారు. చాలామంది ఇండియన్లు వర్క్ పర్మిట్లపై అమెరికాలోకి ప్రవేశించారని, ఆ పర్మిట్ గడువు ముగిసిపోవడంతో అక్రమ వలసదారులుగా మారారని వివరించారు. ఈ అంశంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌‌ను కలవాలని యోచిస్తున్నట్లు మంత్రి చెప్పారు.