
వరుస సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టుబడి దారులను ఆకర్షించేందుకు మరో కీలక ప్రకటన చేశారు. అమెరికాలో పెట్టుబడులు పెట్టే వారి కోసం గోల్డ్ కార్డ్ వీసాలను తీసుకురానున్నట్లు తెలిపారు. అమెరికాలో 5 మిలియన్ డాలర్లు( దాదాపు 44కోట్లు) పెట్టుబడి పెట్టేవారికి ఈ గోల్డ్ కార్డ్ లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు ట్రంప్.
వీసా పొందే వ్యక్తులు అమెరికాలో పెట్టుబడులు పెట్టడంతోపాటు ప్రభుత్వానికి పన్నులు చెల్లించే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు. ఈ కార్డు కొనుగోలు చేయడం ద్వారా వివిధ దేశాల్లోని సంపన్నులు తమ దేశంలోకి వస్తారని ఆయన తెలిపారు. అమెరికాలో ఐదు మిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం రూ. 44 కోట్లు) పెట్టుబడి దారులకు ఈ గోల్డ్ కార్డు వీసాలను మంజూరు చేస్తామని చెప్పారు. అమెరికాలో పెట్టుబడి దారుల కోసం ప్రవేశపెట్టిన ఈబీ–5 వీసా పాలసీని మార్చనున్నట్టు తెలిపారు
గోల్డ్ వీసా సక్సెస్ అవుతుందని తాము భావిస్తున్నామన్నారు ట్రంప్. ప్రస్తుతం EB-5 వీసాల జారీపై ఏడాదికి కొంత పరిమితి ఉండగా.. గోల్డ్ కార్డ్ లపై అలాంటిదేమీ ఉండదని స్పష్టం చేశారు. ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు తమ ప్రభుత్వం కోటి గోల్డ్ కార్డ్ లను ఇవ్వనున్నట్లు చెప్పారు. మరో రెండు వారాల్లో EB-5 వీసాలను ట్రంప్ గోల్డ్ కార్డ్ లతో భర్తీ చేయనున్నారని చెప్పారు వాణిజ్య మంత్రి హోవర్డ్ లట్నిక్ . ఇది కూడా ఒకరకంగా శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్ కార్డ్ లాంటిదే అన్నారు.