తెలంగాణాకు చెందిన 17 ఏళ్ల శ్వేతా రెడ్డి అనే విద్యార్థినికి అమెరికాలోని ప్రముఖ లాఫాయేట్ కాలేజీ ఏకంగా రూ.2 కోట్ల స్కాలర్‌షిప్‌ను ఆఫర్ చేసింది. లాఫాయేట్ కాలేజీలో 4ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ(మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్) కోర్సులో అడ్మిషన్‌తో పాటు ఈ స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. డైయర్ ఫెలోషిప్ పేరుతో కాలేజీ ఇచ్చే ఈ స్కాలర్‌షిప్‌కు వరల్డ్ వైడ్ గా కేవలం ఆరుగురు మాత్రమే ఎంపిక కాగా.. అందులో శ్వేతారెడ్డి ఒకరు. హైస్కూల్ స్థాయిలో శ్వేతారెడ్డి కనబరిచిన ప్రతిభ, నాయకత్వ లక్షణాలు తమను మెప్పించాయని లాఫాయెట్ కాలేజీ యాజమాన్యం తెలిపింది.
స్కాలర్‌షిప్ రావడంపై శ్వేత సంతోషం వ్యక్తం చేశారు. ఇటువంటి అద్భుత అవకాశం రావడం వెనుక డెక్స్‌టెరిటీ గ్లోబల్ సంస్థ ఇచ్చిన శిక్షణ, ప్రోత్సాహం ఉందని తెలిపారు. డెక్స్‌టెరిటీ టూ కాలేజ్ అనే కెరియర్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో శ్వేత నాలుగేళ్లపాటు శిక్షణ పొందారు. ట్రైనింగ్ లో నాయకత్వ లక్షణాలతో పాటు సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను నేర్చుకున్నట్లు తెలిపారు. కేరిర్‌లో తనకు మార్గదర్శిగా నిలిచిన డెక్స్‌టెరిటీ గ్లోబల్ సంస్థ సీఈఓ శరద్ సాగర్‌కు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు.
శ్వేతకు స్కాలర్‌షిప్ రావడం పట్ల డెక్స్‌టెరిటీ సీఈవో శరద్ సాగర్ హర్షం వ్యక్తం చేశారు. రాబోయే తరాలకు నాయకులను సిద్ధం చేయడమే తమ లక్ష్యమన్నారు.