
- ఇప్పటికే పలువురి వీసాలు క్యాన్సిల్.. బాధితుల్లో ఇండియన్లు
- రెడ్ సిగ్నల్ జంప్ లాంటి ట్రాఫిక్ ఉల్లంఘనల్లోనూ యాక్షన్
- దొంగతనం, ఆల్కహాల్ సంబంధిత కేసుల్లో కూడా..
- వీసాల రద్దును వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లిన పలువురు స్టూడెంట్లు
వాషింగ్టన్: విదేశీ విద్యార్థుల విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తున్నది. ఇటీవల క్యాంపస్ నిరసనల్లో పాల్గొన్న ఫారిన్ స్టూడెంట్ల వీసాలను రద్దు చేసిన అగ్రరాజ్యం.. ఇప్పుడు చిన్న చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన స్టూడెంట్ల వీసాలను (ఎఫ్1 వీసా) కూడా రద్దు చేసింది. వీరిలో పదుల సంఖ్యలో ఇండియన్ స్టూడెంట్లు ఉన్నారు. ఓవర్ స్పీడ్, లైసెన్స్‌డ్ సూపర్‌వైజర్ లేకుండా లెర్నర్స్ పర్మిట్‌పై డ్రైవింగ్ చేయడం, రెడ్ సిగ్నల్ జంప్ చేయడం లాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు, షాపుల్లో దొంగతనం లాంటి చిన్న చిన్న నేరాలతో పాటు ఆల్కహాల్ సంబంధిత కేసులు ఉన్న స్టూడెంట్ల వీసాలను అమెరికా ఇమిగ్రేషన్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రద్దు చేశారు. వీరిలో మిస్సోరి, టెక్సాస్, నెబ్రస్కాలోని పలు యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. వాళ్ల వీసాలు రద్దయినట్టు ఆయా విద్యార్థులకు యూనివర్సిటీల నుంచి మెయిల్స్ వచ్చాయి. స్వచ్ఛందంగా అమెరికా విడిచి వెళ్లిపోవాలని అందులో పేర్కొన్నారు.
ఏండ్ల కింది కేసుల్లోనూ చర్యలు..
ఏండ్ల కింద జరిగిన ట్రాఫిక్ ఉల్లంఘనల విషయంలోనూ చర్యలు తీసుకుంటున్నారని పలువురు విద్యార్థులు వాపోయారు. టెక్సాస్‌లోని షాప్‌లో దొంగతనం చేశాడని ఓ స్టూడెంట్‌ను అరెస్టు చేశారని, అయితే ఆ తర్వాత కేసు కొట్టేశారని.. అయినప్పటికీ ఆ స్టూడెంట్ వీసాను రద్దు చేశారని పేర్కొన్నారు. వీసాలు రద్దయిన స్టూడెంట్లు ఆందోళనలో ఉన్నారని, చాలామంది తనకు ఫోన్లు చేస్తున్నారని టెక్సాస్‌కు చెందిన లాయర్ ఒకరు చెప్పారు. ఇలాంటివి 30 కేసులు తన దగ్గర ఉన్నట్టు ఆయన తెలిపారు. ఒకవేళ ఏండ్ల కింద జరిగిన ఉల్లంఘనలైతే, విద్యార్థులు వెంటనే లీగల్ కౌన్సిల్స్‌ను సంప్రదించాలని సూచించారు. కాగా, వీసాల రద్దును వ్యతిరేకిస్తూ కొంతమంది విద్యార్థులు కోర్టుకు వెళ్లారు. తమ వీసాలను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లు వేశారు. చైనాకు చెందిన ఓ స్టూడెంట్ న్యూ హాంప్‌షైర్‌లోని డార్ట్‌మౌత్ కాలేజీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. తాను ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు, నేరాలకు పాల్పడకున్నా తన వీసాను రద్దు చేశారని అతడు కోర్టులో పిటిషన్ ఫైల్ చేశాడు.
స్టూడెంట్లకు వర్క్ వీసా రద్దు!
ఓవైపు విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్న అమెరికా.. వాళ్లు చదువు అయిపోయినంక అక్కడే పని చేసేందుకు అవకాశం కల్పించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్‌ను కూడా రద్దు చేయాలని చూస్తున్నది. ఇందుకు సంబంధించిన బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది. అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ కోర్సులు చేసే స్టూడెంట్లు.. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత అక్కడే మూడేండ్లు ఉండి పని చేసేందుకు ఓపీటీ ప్రోగ్రామ్ అవకాశం కల్పిస్తుంది. తద్వారా వాళ్లు లాంగ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ పొందేందుకు చాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడీ ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని యూఎస్ ఆలోచన చేస్తుండడంతో విదేశీ విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. కాగా, 2023–24 అకడమిక్ ఇయర్‌లో అమెరికాలో 3,31,602 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. వీరిలో 97,556 మంది ఓపీటీ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు.