T20 World Cup 2024: అత్యాచార కేసులో నిర్దోషిగా విడుదల.. సందీప్ లామిచానేకు వీసా నిరాకరణ

జూన్ 2 నుంచి వెస్టిండీస్, యుఎస్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం USA వెళ్లేందుకు నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచానేకు US ఎంబసీ వీసా నిరాకరించింది. అత్యాచార కేసులో ఖాట్మండు కోర్టు అతనిని నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన నేపాల్ 15 మంది స్క్వాడ్ లో సందీప్ లామిచానేకు చోటు దక్కింది. అయితే అతనికి వీసా నిరాకరించడంతో ఈ టోర్నీలో సందీప్ పాల్గొనే అవకాశం లేదు. దీంతో ఫేస్‌బుక్ హ్యాండిల్‌లో సందీప్ నేపాల్ క్రికెట్ కు క్షమాపణలు తెలియజేశాడు. 

ఏంటి ఈ కేసు..?

2022 ఆగస్టులో ఖాట్మండులోని ఓ హోటల్​లో సందీప్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మైనర్‌ బాలిక పోలీసులకు చేసింది ఫిర్యాదు చేసింది. ఈ కేసు పూర్వపరాలువిచారించిన ఖాట్మండు జిల్లా కోర్టు.. 2024 జనవరిలో అతన్ని దోషిగా తేలుస్తూ 8 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అదే తీర్పులో అత్యాచారం జరిగిన సమయానికి బాధిత బాలిక మైనర్ కాదని, ఆమెకు రూ.2,00,000 నష్టపరిహారం చెల్లించాలని, కోర్టుకు రూ.3,00,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
 
దీనిని సవాల్ చేస్తూ లామిచానే పైకోర్టుకు వెళ్లగా.. తీర్పు అతనికి అనుకూలంగా వచ్చింది.  తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్​ సూర్య దర్శన్, దేవ్ భట్టా డివిజన్ బెంచ్.. గతంలో జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ఈ కేసులో అతన్ని నిర్దోషిగా తేలుస్తూ.. రేప్ కేసు ఆరోపణల నుండి విముక్తి కల్పించింది.