US Visa: 2 వేల భారతీయుల వీసా అప్లికేషన్స్ క్యాన్సిల్.. తాట తీస్తున్న యూఎస్ ఎంబసీ

US Visa: 2 వేల భారతీయుల వీసా అప్లికేషన్స్ క్యాన్సిల్.. తాట తీస్తున్న యూఎస్ ఎంబసీ

US Embassy: అమెరికా వెళ్లాలి అనేది సగటు భారతీయ మధ్యతరగతి యువత కల. మంచి జీతంతో పాటు తమ తర్వాతి తరాల వారికి కూడా మంచి జీవితం అగ్రరాజ్యంలో లభిస్తుందనేది చాలా మంది నమ్మకం. అందుకే ప్రతి ఏటా అమెరికా వీసాల కోసం క్యూ పెరుగుతూనే ఉంది. బీటెక్ పూర్తి చేయగానే అమెరికాలో ఉన్నత చదువులు  ఆ తర్వాత అక్కడే ఏదైనా జాబ్ సంపాదించాలనేది చాలా మంది ప్లాన్. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో ప్రజలు అమెరికా వెళ్లేందుకు మెుగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో కొందరు అమెరికాకు వీసాలకు ఉన్న భారీ క్యూ నుంచి తప్పించుకునేందుకు ఉన్న తప్పుడు మార్గాలను ఉపయోగిస్తున్నట్లు యూఎస్ ఎంబసీ గుర్తించింది. దీంతో భారతదేశంలోని యూఎస్ ఎంబసీ తాజాగా 2 వేల మందికి సంబంధించిన వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసినట్లు పేర్కొంది. వాటిలో తమ వీసా షెడ్యూలింగ్ విధానాన్ని అప్లికెంట్లు అతిక్రమించినట్లు పేర్కొనటం గమనార్హం. ఇలాంటి తప్పుడు పద్ధతులను తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోయేది లేదని ఏకంగా ఎంబసీ అధికారిక ఎక్స్ ఖాతాలో కూడా పేర్కొంది.

దీంతో అప్లికేషన్లలను క్యాన్సిల్ చేయటంతో పాటు సదరు అసోసియేట్ల ఖాతాలను కూడా నిలిపివేస్తున్నట్లు అందులో పేర్కొంది. ఏజెంట్ల తప్పుడు షెడ్యూలింగ్ పద్ధతులపై తాము జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు భారతదేశంలోని యూఎస్ ఎంబసీ ప్రకటించింది. దీనితో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దిల్లీలోని చాణక్యపురిలోని అమెరికా రాయబార కార్యాలయం ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 27న దాఖలు చేసిన కేసులో, మే-ఆగస్టు 2024 మధ్య వీసా మోసంలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలకు చెందిన 30 మందికి పైగా వ్యక్తులపై ప్రస్తుతం చర్యలు తీసుకోబడుతున్నాయి.

యూఎస్ వీసాలకు ఉన్న క్యూ కారణంగా ఏజెంట్లు తక్కువ గడువు ఉండే బిజినెస్, విజింగ్ లేదా విద్యార్థి వీసా మార్గాలను దుర్వినియోగం చేస్తున్నట్లు ఎంబసీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఏజెంట్లు ఒక్కొక్కరి నుంచి దాదాపు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు వసూలు చేస్తున్నట్లు బాధితులు అందించిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో యూఎస్ వీసాల కోసం వేచి ఉండాల్సిన గడువు దాదాపు 2-3 సంవత్సరాలుగా ఉన్న సంగతి తెలిసిందే. దీనినే ఏజెంట్లు ఉపయోగించుకుంటూ బాట్ల ద్వారా వీసా ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే వీసా అప్రూవ్ అయిన వ్యక్తుల నుంచి లక్షల్లో ఏజెంట్లు గుంజుతున్నట్లు ఇటీవల బయటపడటం గమనార్హం.