ఉద్యోగం తీసేశాడని.. మేనేజర్ ను చితక్కొట్టింది

ఓ ఎయిర్ పోర్ట్ ఉద్యోగి..ఉద్యోగం నుంచి తొలగించాడని ఆవేశంతో ఊగిపోయింది. ఆగ్రహంతో ఇద్దరు మేనేజర్లపై దాడి చేసింది.మేనేజర్లతో భయంకరంగా పోరాడింది. మేనేజర్ విసినేస్తే గిర్రున తిరిగి పడింది.. గోడకు కొట్టిన రబ్బరు బంతిలా రయ్యిన లేచింది.. మళ్లీ మేనేజర్ తో పోరాటానికి దిగింది. ఇలా దాదాపు మూడు నిమిషాల వీడియోలో ఆమె పోరాటానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

షోకోరియా ఎల్లీ..అమెరికాలోని హార్ట్స్ ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ కాఫీ షాపులో ఉద్యోగం చేస్తోంది. జనవరి 13న ఎల్లీ కి, సహోద్యోగి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు యాజమాని. ఉద్యోగం పోవడంతో ఎల్లీకి కోపం వచ్చింది. తన అసహనాన్ని అక్కడి మేనేజర్లపై చూపింది. కుర్చీలు విసిరింది..పిడిగుద్దులతో వారితో దాడి చేసింది. వారితో తన్నులు కూడా తిన్నది. దీనికి సంబంధించిన వీడియోలను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇక్కడ షోకోరియా ఎల్లీ.. ఇద్దరు మేనేజర్లతో పోరాడిన విషయమే హైలైట్.. ఆమె పోరాట పటిమకు నెటిజన్లు  ఆశ్చర్యపోయారు. ఎల్లీ అటాకింగ్ చూసి విస్తుపోయారు. రింగ్ లో ఓ బాక్సర్ పోరాటంలా అనిపించిందంటున్నారు నెటిజన్లు.