చంద్రయాన్-3 విజయం ఇస్రోకు మరింత పేరును తెచ్చిపెట్టింది. ఈ వ్యోమనౌక అభివృద్ధి కార్యకలాపాలను చూసిన అమెరికా.. భారత అంతరిక్ష సాంకేతికతను తమతో పంచుకోవాలని చూస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథే చెప్పారు. అమెరికాలో సంక్లిష్టమైన రాకెట్ మిషన్లను అభివృద్ధి చేయడంలో నిమగ్నమైన నిపుణులు తమతో అంతరిక్ష సాంకేతికతను పంచుకోవాలని భారత్‌ను కోరినట్లు సోమనాథ్ తెలిపారు.
దేశంలో అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ ప్లేయర్‌లు ప్రవేశించడానికి గల కారణాన్ని సోమనాథ్ వెల్లడించారు. కాలం మారిందని, భారతదేశం ఇప్పుడు అత్యుత్తమ పరికరాలు, రాకెట్‌లను తయారు చేయగలదని చెప్పారు. తమిళనాడులోని రామేశ్వరంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ అందుకే అంతరిక్ష రంగానికి తెరతీశారని అన్నారు.
ఈరోజు దివంగత మాజీ రాష్ట్రపతి 92వ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సోమనాథ్.. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. “మన దేశం చాలా శక్తివంతమైన దేశం. మీకు తెలుసా? మన జ్ఞానం, మేధస్సు స్థాయి ప్రపంచంలోనే అత్యుత్తమమైనది”అని ఇస్రో చీఫ్ అన్నారు.