న్యూఢిల్లీ: ఈ వారం మార్కెట్ డైరెక్షన్‌ను యూఎస్ ఫెడ్ మీటింగ్ నిర్ణయించనుంది. దీంతోపాటు కంపెనీల జూన్ క్వార్టర్ (క్యూ1) రిజల్ట్స్, ఎఫ్‌ఐఐల కదలికలు ప్రభావం చూపనున్నాయి. ఈ నెల 31 న ఫెడ్ తన పాలసీ నిర్ణయాన్ని ప్రకటించనుంది. వడ్డీ రేట్ల కోతను తొందరగా చేపడుతుందని మార్కెట్ అంచనా వేస్తోంది. గెయిల్, అదానీ పవర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, భెల్, కోల్ ఇండియా, ఎం అండ్ ఎం, మారుతి, టాటా స్టీల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, టాటా మోటార్స్ తమ క్యూ1 ఫలితాలను ఈ వారం ప్రకటించనున్నాయి.
ఇండియా మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ డేటా, ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఔట్‌పుట్ డేటా, చైనా మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ డేటా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (బీఓఈ) పాలసీ మీటింగ్, యూఎస్ ఎంప్లాయ్‌మెంట్ డేటా, ఫెడ్ రిజర్వ్ పాలసీ నిర్ణయం ఈ వారం విడుదల కానున్నాయి. వీటితో పాటు డాలర్ –రూపాయి కదలికలు, క్రూడాయిల్ ధరలపై ఫోకస్ పెట్టాలని ట్రేడర్లకు ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. కిందటి వారం సెన్సెక్స్ 728 పాయింట్లు (0.90 శాతం), నిఫ్టీ 304 పాయింట్లు ర్యాలీ చేశాయి.