
- విదేశీ సంస్థలతో చేతులు కలిపిందే బీజేపీ, ఆర్ఎస్ఎస్
- అమెరికా నిధులను బంగ్లాదేశ్‌కు మళ్లించిందెవరు?
- అక్కడి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు మోదీ సర్కార్ కుట్ర చేసిందా? అని ప్రశ్న
న్యూఢిల్లీ : ఇండియాకు అమెరికా నిధుల వ్యవహారమంతా ఓ కట్టుకథ అని.. అది సృష్టించింది బీజేపీ, ఆర్ఎస్ఎస్ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మండిపడ్డారు. బీజేపీ నేతలు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. శనివారం ఢిల్లీలో మీడియాతో పవన్ ఖేరా మాట్లాడారు. ఈ సందర్భంగా మూడు విషయాలను ఆయన ప్రస్తావించారు.
‘‘ఇండియాలో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా నిధులు ఇవ్వలేదని వాషింగ్టన్ పోస్టు, ఇతర మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఆ నిధులను బంగ్లాదేశ్‌కు మళ్లించినట్టు తెలిపాయి. అయితే ఇండియాలో ఓటింగ్ శాతం పెంచేందుకు గత బైడెన్ సర్కార్ కేటాయించిన నిధులను ఆపేశామంటూ ‘డోజ్’తో ప్రధాని మోదీ బెస్ట్ ఫ్రెండ్ ట్రంప్ ఉద్దేశపూర్వకంగానో లేక అనుకోకుండానో ఓ కామెంట్ చేయించారు. కానీ అది నిజమా? కాదా? అని కూడా తెలుసుకోకుండా.. మా పార్టీపై బీజేపీ నిందలు వేసింది. దీన్ని బట్టి ఇదంతా బీజేపీ, ఆర్ఎస్ఎస్ అల్లిన కట్టుకథ అని అర్థమవుతున్నది.
గతంలో యూపీఏ సర్కార్ ను అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నించింది. విదేశీ సంస్థల సహకారం తీసుకున్నది. మన దేశంలో ఎమర్జెన్సీ సమయంలో యూఎస్ సీఐఏను ఆర్ఎస్ఎస్ సాయం కోరింది. యూపీఏ సర్కార్ ను కూలగొట్టేందుకు అన్నాహజారే, అర్వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ఆర్ఎస్ఎస్ నడిపించింది. అందుకు యూఎస్ ఎయిడ్, ఫోర్డ్ ఫౌండేషన్ సాయం తీసుకున్నది. ఇప్పుడా తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నది” అని పవన్ ఖేరా మండిపడ్డారు.
బంగ్లాదేశ్‌కు వెళ్లిన నిధుల గురించి తెల్వదా?
ఇండియాకు కేటాయించిన ఫండ్స్‌ను బంగ్లాదేశ్‌కు మళ్లించినట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయని పవన్ ఖేరా తెలిపారు. ఒకవేళ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఆ దేశానికి నిధులు మళ్లించినట్టయితే.. మిత్రదేశం అని చెబుతున్న బంగ్లాదేశ్ మీద మోదీ సర్కార్ కుట్ర చేసినట్టు కాదా? అని ప్రశ్నించారు. బంగ్లాదేశ్‌లో ఖర్చు చేసిన నిధుల గురించి మోదీ సర్కార్‌కు తెలియకపోవడమేమిటి? అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
‘కిక్‌బ్యాక్స్’ వెనక ఎవరున్నరో తేలుస్తం: జైశంకర్
మన దేశంలో ఎన్నికలను ప్రభావితం చేయడానికి యూఎస్ ఎయిడ్ నుంచి 21 మిలియన్ డాలర్లు నిధులు అందాయన్న సమాచారంపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిధులపై దర్యాప్తు ప్రారంభమైందని స్పష్టం చేశారు. ఎవరికి డబ్బు అందింది.. మేలు ఎవరికి జరిగిందనే విషయాన్ని తేలుస్తామన్నారు. ట్రంప్ యంత్రాంగం నుంచి బహిర్గతమైన సమాచారం కచ్చితంగా ఆందోళన కలిగించేదేనన్నారు.
కేంద్రం ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోందని తెలిపారు. ఈ ఆరోపణలు నిజమైతే భారతదేశంలో ఏదో ఒక ఎజెండాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరిగినట్టేనన్నారు. భారత ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణిస్తోందని.. నిజం త్వరలోనే బయటపడుతుందని జైశంకర్ పేర్కొన్నారు.