
వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సర్కారు చిన్న చిన్న కారణాలకే స్టూడెంట్ వీసాలను రద్దు చేయడంతోపాటు అరెస్టులు చేస్తుండటంతో ఇండియన్ స్టూడెంట్లతోపాటు ఆయా దేశాల విద్యార్థులు వణికిపోతున్నారు. అడుగు బయటపెట్టాలంటేనే టెన్షన్ పడుతున్నారు. కాలేజీలకు కాదు కదా.. కనీసం మార్కెట్ కు వెళ్లి సరుకులు కొనుక్కొని తెచ్చుకునేందుకూ జంకుతున్నారు. ఎక్కడివారక్కడ ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
యూనివర్సిటీల్లో పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొనడం, పాలస్తీనాకు అనుకూలంగా, అమెరికాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, చివరకు లిమిట్ కు మించిన స్పీడ్ తో కార్ డ్రైవ్ చేయడం వంటి కారణాలతో గత నెల రోజుల్లోనే 1,024 మంది ఫారిన్ స్టూడెంట్ల వీసాలను ట్రంప్ సర్కార్ రద్దు చేసింది. వీరిలో అత్యధిక మంది ఇండియన్ స్టూడెంట్లే ఉన్నట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. అమెరికాలో ఉండాలంటే అక్కడి చట్టాలను పక్కాగా ఫాలో కావాల్సిందేనని, లేకపోతే కఠిన చర్యలు తప్పవంటూ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇప్పటికే హెచ్చరించారు.