అక్రమ వలసదారుల కోసం గురుద్వారాలో సెర్చింగ్

అక్రమ వలసదారుల కోసం గురుద్వారాలో సెర్చింగ్

 

  • చర్చ్​లు, స్కూళ్లల్లోనూ అధికారుల తనిఖీలు
  • పెద్ద ఎత్తున గాలింపు చేపట్టిన పోలీసులు
  • రెండ్రోజుల్లోనే 1,242 మంది అరెస్ట్
  • గురుద్వారాల్లో తనిఖీలపై సిక్కుల ఆగ్రహం 

వాషింగ్టన్:  అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. ట్రంప్ ఇదివరకే ప్రకటించినట్టుగా.. పెద్ద ఎత్తున ఇల్లీగల్ ఇమిగ్రెంట్లను అరెస్ట్ చేస్తూ, వారి దేశాలకు అమెరికా అధికారులు పంపేస్తున్నారు. అయితే, గురుద్వారాలు, చర్చిల వంటి ప్రార్థనా స్థలాలతోపాటు హాస్పిటల్స్, సోషల్ సర్వీస్ సంస్థలు, స్కూళ్లలోనూ అక్రమ వలసదారులు, క్రిమినల్స్ కోసం తనిఖీలు చేపడుతుండటం పట్ల దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా గురుద్వారాల్లోకి సాయుధ అధికారులు, భద్రతా సిబ్బంది ప్రవేశించడంపై సిక్కు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా నుంచి అక్రమ వలసదారులను పంపేయడం అనేది నిరంతరం జరిగే ప్రక్రియే అయినా.. ట్రంప్ అధికారంలోకి రాగానే ఈ ప్రక్రియ జోరందుకుందని మీడియా తెలిపింది.న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లోని గురుద్వారాల్లో యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్), ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసీఈ), కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్(సీబీపీ) సంస్థల అధికారులు సంయుక్తంగా దాడులు మొదలుపెట్టారు. న్యూయార్క్, న్యూజెర్సీల్లోని గురుద్వారాలు సిక్కు వేర్పాటువాదులకు, అక్రమ వలసదారులకు అడ్డాలుగా మారిపోయినందుకే తనిఖీలు చేపడుతున్నామని డీహెచ్ఎస్ అధికారులు చెప్తున్నారని ‘పీటీఐ’ వార్తా సంస్థ వెల్లడించింది. 

ట్రంప్ గద్దెనెక్కిన కొన్ని గంటలకే.. 

అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటలకే అక్రమ వలసదారుల వేటకు డీహెచ్ఎస్ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం బైడెన్ హయాంలో జారీ చేసిన గైడ్ లైన్స్​ను డీహెచ్ఎస్ రద్దు చేసింది. దీంతో ప్రార్థనా స్థలాలతోపాటు స్కూళ్ల వంటి సెన్సిటివ్ ఏరియాల్లోకి సైతం ఐసీఈ, సీబీపీ అధికారులు వెళ్లి తనిఖీలు చేపట్టేందుకు మార్గం సుగమం అయింది. నేరాలు చేసి దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన క్రిమినల్స్​ను పట్టుకునేందుకు తాజా గైడ్​లైన్స్ తమకు అధికారాలను కట్టబెట్టాయని అధికారులు తెలిపారు.

సిక్కు సంఘాల ఆగ్రహం 

అక్రమ వలసదారుల కోసం గురుద్వారాల్లో డీహెచ్ఎస్ ఏజెంట్లు తనిఖీలు చేయడం పట్ల సిక్కు సంఘాలు మండిపడుతున్నాయి. ట్రంప్ సర్కారు చర్యలు గురుద్వారాల పవిత్రతను, సిక్కుల విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని విమర్శిస్తున్నాయి. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని సిఖ్ అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ ప్రకటించింది.

‘షికాగో’పై బార్డర్ జార్ స్పెషల్ ఫోకస్ 

అమెరికాలో క్రిమినల్ గ్యాంగులు, అక్రమ వలసదారులకు అడ్డాలుగా మారిపోయిన పదులకొద్దీ ప్రాంతాల్లో ఇల్లినాయీ స్టేట్​లోని షికాగో కూడా ఒకటని డీహెచ్ఎస్ అధికారులు చెప్తున్నారు. షికాగో గవర్నర్ జేబీ ప్రిట్జ్ కర్ (డెమోక్రటిక్ పార్టీ) ట్రంప్ సర్కారుకు వ్యతిరేకంగా ఉండటంతో.. అక్కడ ఫెడరల్ అధికారులకు సిటీ పోలీసులు సహకరించడం లేదంటున్నారు. అయినా.. ఫెడరల్ సంస్థల ఏజెంట్లంతా సమన్వయంతో దాడులు చేస్తున్నట్టు తెలిపారు. షికాగోలో అక్రమ వలసదారులపై ఫెడరల్ ఏజెంట్ల దాడులను ఆపేందుకు కొన్ని సంస్థలు కోర్టులను కూడా ఆశ్రయిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో యూఎస్ బార్డర్ జార్ (సరిహద్దు భద్రతపై నియమితుడైన ప్రత్యేక అధికారి) టామ్ హోమన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. 

కొలంబియా యూటర్న్.. బ్రెజిల్ ఫైర్ 

తమ పౌరులను క్రిమినల్స్ మాదిరిగా బంధించి పంపిస్తే తీసుకోబోమంటూ తేల్చిచెప్పి న కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో.. చివరకు ఆంక్షల భయంతో యూటర్న్ తీసుకున్నారు. యూఎస్ నుంచి రెండు సైనిక విమానాల్లో అక్రమ వలసదారులను కొలంబియాకు పంపగా.. తొలుత ఫ్లైట్లను అనుమతించలేదు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్లను తీసుకోకపోతే ఆ దేశం నుంచి పంపే వస్తువులపై 50% సుంకాలు, ఇతర ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీంతోపాటు స్వదేశంలోనూ పెట్రోపై విమర్శలు రావడంతో చివరకు ఆయన వెనక్కి తగ్గారు.

రోజూ 311 మంది అరెస్ట్  

షికాగోతోపాటు అరిజోనా, కాలిఫోర్నియా, కొలరాడో, జార్జియా, నెబ్రాస్కా, టెక్సాస్ రాష్ట్రాల్లోనూ స్పెషల్ ఆపరేషన్లు చేపట్టనున్నట్టు ఫెడరల్ అధికారులు తెలిపారు. కొలరాడాలో వెనెజులా గ్యాంగ్ మెంబర్లు టార్గెట్ గా ఆపరేషన్ ఉంటుందన్నారు. ఆదివారం డెన్వర్ లో 50 మందిని అరెస్ట్ చేశామని, వారి నుంచి కొకైన్, హ్యాండ్ గన్స్, క్యాష్ స్వాధీనం చేసుకున్నామన్నారు. డ్రగ్ స్మగ్లర్లు, క్రిమినల్ ఆర్గనైజేషన్లను ఫారిన్ టెర్రరిస్ట్ సంస్థలుగా గుర్తిస్తూ ట్రంప్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో వీరిపై చర్యలకు మార్గం సుగమమైందన్నారు. ఇక దేశవ్యాప్తంగా శనివారం 286 మందిని, ఆదివారం 956 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేసినట్టు ఐసీఈ అధికారులు ప్రకటించారు. అయితే, ఇలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్లను అరెస్ట్ చేయడం కొత్త విషయమేమీ కాదని.. సెప్టెంబర్ 30న ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రోజూ యావరేజ్ గా 311 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు.