అమెరికాలో భార్యాకొడుకును కాల్చి చంపిన ఇండియన్ టెకీ

అమెరికాలో భార్యాకొడుకును కాల్చి చంపిన ఇండియన్ టెకీ

మైసూర్: అమెరికాలో కర్ణాటకకు చెందిన కుటుంబం ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. అమెరికాలో ఉంటున్న ఒక వ్యాపారవేత్త భార్య, కొడుకును కాల్చి చంపి తానూ ఆ తర్వాత అదే గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జరిగిన సమయంలో చిన్న కొడుకు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని మైసూరుకు చెందిన హర్షవర్ధన కిక్కెరి (45), అతని భార్య శ్వేత (41), వారి ఇద్దరు పిల్లలు అమెరికాలోని న్యూకాజిల్ లో ఉంటున్నారు. మైసూరులో ఉన్న సమయంలో.. హర్షవర్ధన కిక్కెరి HoloWorld అనే రోబోటిక్ కంపెనీని మైసూర్ సమీపంలో స్టార్ట్ చేశాడు. అయితే.. కోవిడ్-19 ఉపద్రవం వల్ల కంపెనీ నష్టాల పాలైంది. దీంతో.. హర్షవర్ధన తన కుటుంబంతో కలిసి అమెరికా వచ్చేశాడు.

కొన్నాళ్లుగా డిప్రెషన్తో బాధపడుతున్న అతను భార్య, కొడుకును చంపేసి తానూ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఏప్రిల్ 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కింగ్ కౌంటీలోని టౌన్ హౌస్ నుంచి గత వారం 911కు కాల్ వచ్చిందని, కిటికీ మీద రక్తం, స్ట్రీట్లో రోడ్డు మీద బుల్లెట్, మూడు మృతదేహాలు పడి ఉన్నాయని స్థానికులు 911కు కాల్ చేశారు. ముగ్గురూ చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు పోలీసులు తెలియజేశారు. విషయం తెలిసి.. హర్షవర్ధన తల్లి గిరిజ మైసూరు నుంచి అమెరికాకు వెళ్లారు. హర్షవర్ధన సోదరుడు చేతన్ ఈ మధ్యే అమెరికా నుంచి మైసూరుకు వచ్చి ఉంటున్నాడు.